NTV Telugu Site icon

47 బుల్లెట్స్‌ దిగినా… బ్రతికింది ప్రజల కోసమే: కొండా మురళి

కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్‌, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. హనుమకొండలోని కొండా క్యాంపు ఆఫీసులో బుధవారం ఈ మూవీట్రైలర్ ను విడుదల చేశారు.ట్రైల‌ర్‌లో కొండా మురళి కాలేజీ జీవితం నుంచి సురేఖతో ప్రేమలో పడటం, మావోయిస్టులతో చేతులు కలపడం, రాజకీయాల్లోకి రావడం చూపించారు. ‘వాడ్ని సంపుడు నా పని కాదు, బాధ్యత’ అని ట్రైలర్ చివర్లో కొండా మురళి పాత్రధారి చేత ఓ డైలాగ్ చెప్పించారు. అది ఎవర్నీ అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సరిగ్గా 30 ఏళ్ల క్రితం జనవరి 26న, 10.25 గంటలకు కొండా మురళిని షూట్ చేసి చంపడానికి ట్రై చేశారని, అందుకని అదే సమయానికి ట్రైలర్ విడుదల చేశామని వర్మ తెలిపారు.

కొండా మురళి మాట్లాడుతూ “నేను ఆర్జీవీకి రెండు ముక్కలు చెబితే… ఆయన వంద మంది దగ్గర ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకుని సినిమా తీశారు. ఆయన రెండు నెలల పదహారు రోజులు వరంగ‌ల్‌లో ఉండి షూటింగ్ చేశారు. ఎక్కడా ఉండని ఆయన రెండున్నర నెలల ఇక్కడ ఉన్నారంటే కథ ఎంత నచ్చిందో తెలుస్తోంది. ఇదే జనవరి 26న నా మీద 47 బుల్లెట్లు ఫైరింగ్ చేశారు. అయినా బతికాను. అది కూడా మా కుటుంబం కోసం కాదు, ప్రజల కోసమని తెలియజేస్తున్నాను. సినిమా గురించి చెప్పడం కన్నా చూస్తే బావుంటుంది. త్రిగుణ్‌ బాగా నటించాడు. సురేఖ కంటే ఇర్రా మోర్ అందంగా ఉన్నారు. బాగా నటించింది” అని అన్నారు.

కొండా సురేఖ మాట్లాడుతూ”ట్రైలర్ చూశాక మేము ఎంత బాధ అనుభవించామనేది గుర్తొచ్చింది. భావోద్వేగానికి లోనయ్యా. ముఖ్యంగా ఫైరింగ్‌ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు కూడా జనవరి 26. నేను వెళ్లేసరికి మురళిగారు వైట్ లాల్చీ పైజామాలో రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఆయన చుట్టూ జనం నిలబడి ఉన్నారు. నా కూతురు ఎక్కడ ఉందో కనపడలేదు. నన్ను ఆయన దగ్గరకు వెళ్లనివ్వడం లేదు. మరణించాడని అన్నారు. ఆ రోజు ఆయన మరణించి ఉంటే… ఈ రోజు మేం ఎక్కడ ఉండేవాళ్లమో? మా కుటుంబం ఎక్కడ ఉండేదో? అసలు, మా పరిస్థితి ఏంటో? ఆలోచించడానికి కూడా కష్టంగా ఉంది. దేవుడు నాకు ఇచ్చిన పసుపు కుంకుమ బలం కొండా మురళి గారు మన ముందు ఉండటం. మా పుట్టినరోజులు, పెళ్లి రోజు, పండగలకుఆయన కాళ్లు మొక్కుతా. ఇటీవల తొలిసారి అడిగా… ‘కాళ్లు మొక్కినప్పుడు ఏం అనుకుంటారు?’ అని. ‘నీ తాళిబొట్టు గట్టిది అనుకుంటాను’ అని చెప్పారు. మా మనవరాలు శ్రేష్ఠ పటేల్ పెళ్లి వరకూ కొండా దంపతులు ఇలాగేఉంటారనిఆశిస్తున్నాను. ఆర్జీవీ గారి గురించి బయట విన్నదానికి, చూసిన దానికి అసలు సంబంధం లేదు. ఆయన గురించి బయట చెప్పేవన్నీ అబద్దాలు” అని చెప్పారు.

మార్చి నెలలో జనం ముందుకు రాబోతున్న ‘కొండా’ చిత్రంలో పృథ్వీరాజ్, పార్వతి అరుణ్, ప్రశాంత్, ఎల్బీ శ్రీరామ్, తులసి, ‘జబర్దస్త్’ రామ్ ప్రసాద్, అభిలాష్ చౌదరి, శ్రవణ్, అనిల్ కుమార్ రెడ్డి లింగంపల్లి, గిరిధర్ చంద్రమౌళి, రవి, షబీనా ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.