బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకుని నేటితో ఏడాది గడుస్తోంది. సరిగ్గా గత ఏడాది ఇదే రోజున సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆయన మరణించి ఏడాది గడుస్తున్నా కేసు మాత్రం ఇంకా తేలకపోవడం గమనార్హం.
నాటకీయ పరిణామాలతో అనేక మలుపులు తీసుకున్న సుశాంత్ కేసును చివరకు ఆత్మహత్యగా తేల్చారు పోలీసులు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడగానికి గల కారణం ఏంటో మాత్రం ఇప్పటివరకూ కనిపెట్టలేకపోయారు. దేశంలోని టాప్ ఆసుపత్రి ఎయిమ్స్ సిబిఐకి సమర్పించిన ఫోరెన్సిక్ నివేదికలో సుశాంత్ అస్ఫిక్సియా (ఊపిరి ఆడకపోవడం) కారణంగా మరణించాడని తెలిసింది. సుశాంత్ మృతి సెగ బాలీవుడ్ కు గట్టిగానే తగిలిందని చెప్పాలి.
ఆయన ఆత్మహత్యతో బాలీవుడ్ లో నెపోటిజంపై అంతకుముందెన్నడూ ఎరుగని రేంజ్ ఫైర్ అయ్యారు నెటిజన్లు. ఇక సుశాంత్ ఆత్మహత్య కేసులో వెలుగు చూసిన డ్రగ్ కోణం మరో సంచలనానికి తెరతీసింది. అందులో స్టార్స్ పేర్లు బయటకు రావడం బాలీవుడ్ కు గట్టి దెబ్బ. బాలీవుడ్ ధగధగలు వెనుక దాగున్న చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చింది సుశాంత్ మరణం. అప్పటికే సుశాంత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రేయసి రియా చక్రవర్తి ఈ డ్రగ్స్ కేసులోనే జైలుకు వెళ్ళింది. ఆ తరువాత బెయిల్ పై బయటకు వచ్చినప్పటికీ సుశాంత్ అభిమానుల ట్రోలింగ్ కు బలైంది.
ఇక ఇటీవలే సుశాంత్ ఫ్రెండ్ సిద్ధార్థ్ పితానిని డ్రగ్స్ కేసులో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి సుశాంత్ ఆత్మహత్య చేసుకుని ఏడాది గడుస్తున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం ఆయన అభిమానులను బాధ పెడుతోంది.
టాలెంటెడ్ హీరో సుశాంత్ తాను నటించిన కై పో చే, ఎంఎస్ ధోని, సోంచిరియా, చిచ్చోరె వంటి అద్భుతమైన చిత్రాల ద్వారా అభిమానుల హృదయాల్లో ఎప్పటికి నిలిచిపోతాడు. సుశాంత్ ఆఖరిగా నటించిన చిత్రం “దిల్ బెచారా”. జూలై 2020లో సుశాంత్ మరణానంతరం ఈ చిత్రం డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదలై వీక్షణల పరంగా చరిత్రను సృష్టించింది. ప్రస్తుతం సుశాంత్ కేసు త్వరగా తేలాలని అభిమానులు కోరుకుంటున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారిస్తోంది. ప్రస్తుతం #SushantSinghRajput అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో దేశవ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. సుశాంత్ ను స్మరిస్తూ అభిమానులు ఈ హ్యాష్ ట్యాగ్ ను భారీ సంఖ్యలో ట్రెండ్ చేస్తున్నారు. మరి సుశాంత్ కేసులో చివరకు ఎలా ముగుస్తుందో చూడాలి.