NTV Telugu Site icon

చెర్రీ, శంక‌ర్ మూవీ సెట్స్ పైకి 2022లోనే!

సినిమా క‌ష్టాలు అంటే ఏమిటో సినిమా వాళ్ల‌కే బాగా అనుభ‌వంలోకి వ‌స్తాయి. ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ అదే ప‌రిస్థితిలో ఉన్నారు. పైకి గంభీరంగా ఆయ‌న క‌నిపిస్తున్నా, లోలోప‌ల ఏ సినిమా ఎప్పుడు ఎలా పూర్తి చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మౌతున్నారని తెలుస్తోంది. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న శంక‌ర్… నిజంగా ఇన్ని వివాదాల్లో ఒకేసారి కూరుకుపోతార‌ని కోలీవుడ్ లో ఎవ‌రూ ఊహించ‌లేద‌ట‌. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి స్టార్ హీరోలు సిద్ధంగా ఉన్నారు, అలానే కోట్లు ఖ‌ర్చుపెట్టి సినిమాలు నిర్మించ‌డానికి ప్రొడ్యూస‌ర్స్ సైతం సై అంటున్నారు. కానీ కాలం క‌లిసి రాక‌పోవ‌డం వ‌ల్ల శంక‌ర్ ఇబ్బందులు పడుతున్న‌ట్టు అనిపిస్తోంది. రామ్ చ‌ర‌ణ్ – శంక‌ర్ కాంబినేష‌న్ లో దిల్ రాజు ఈ యేడాది ద్వితీయార్థంలో కొత్త సినిమాను ప‌ట్టాలెక్కించాల్సి ఉంది. ఆ క్రేజీ, భారీ మూవీకి రూ. 150 కోట్ల బ‌డ్జెట్ అవుతుంద‌ని అంచ‌నాలు వేశారు. కానీ ఇండియ‌న్ -2 నిర్మాత‌ల‌తో వైరం ఓ కొలిక్కి వ‌చ్చే వ‌ర‌కూ చెర్రీ మూవీ సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ క‌నిపించ‌డం లేదు.

ఇప్ప‌టికే యాభై శాతం పూర్తి అయిన ఇండియ‌న్ 2ను పూర్తి చేసి కానీ శంక‌ర్ మ‌రో సినిమా చేయ‌డానికి వీలు లేకుండా ఆయ‌న చేతుల‌కు బంధం వేసే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది. పైగా దీనితో పాటు హిందీలోనూ ర‌ణ‌వీర్ సింగ్ తో ఓ మూవీ చేయ‌డానికి శంక‌ర్ అంగీక‌రించాడు. ఒక‌వేళ క‌మ‌ల్ హాస‌న్ఇండియ‌న్ 2ను పూర్తి చేసి కానీ రామ్ చ‌ర‌ణ్ ప్రాజెక్ట్ కు శంక‌ర్ రాక‌పోతే… అప్ప‌టి వ‌ర‌కూ చెర్రీ ఖాళీగా ఉండ‌గ‌ల‌డా? అనే సందేహం ఒక‌టి ఉంది. మ‌రి క‌మ‌ల్, చెర్రీల సినిమాలు పూర్తి చేసే వ‌ర‌కూ అక్క‌డ ర‌ణ‌వీర్ సింగ్ ఆగుతాడా అనే మ‌రో ప్ర‌శ్నా ఉద‌యిస్తోంది. ఏది ఏమైనా ఈ యేడాది ద్వితీయార్థంలో మాత్రం చెర్రీ – శంక‌ర్ మూవీ సెట్స్ పైకి వెళ్ళ‌డద‌ని సినీజ‌నం భావిస్తున్నారు. వ‌చ్చే యేడాది మాత్ర‌మే దీని రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ట‌. మ‌రి ఈ లోగా ఏదైనా మిర‌కిల్ జ‌రిగి, ఇండియ‌న్ 2 నిర్మాత‌ల‌ను శంక‌ర్ ఒప్పించ‌డ‌గ‌లిగితే… మంచిదే!!