NTV Telugu Site icon

ప్రశ్నార్థకంగా ప్రియా వారియర్ కెరీర్!

కన్నుగీటి దేశవ్యాప్తంగా ఓవర్ నైట్ గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ టాలీవుడ్ ప్రేక్షకుల నుండి ‘ఇష్క్’ లభించక ఇక్కట్లు పడుతోంది. ప్రమోషనల్ వీడియోతో వచ్చిన క్రేజ్ తొలి మలయాళ చిత్రం ‘ఒరు ఆడార్ లవ్’ బిజినెస్ కు మాత్రమే ఉపయోగపడింది. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ కారణంగా తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో డబ్ చేసి నిర్మాతలు సొమ్ము చేసుకోలిగారు. కానీ ఈ మూవీ సైతం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపలేదు. అయితే… తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ప్రియా ప్రకాశ్ వారియర్ కు అవకాశాలు లభించేలా చేసింది.

ప్రియా ప్రకాశ్ వారియర్ నటించి హిందీ, కన్నడ సినిమాలు ఇంకా విడుదలకు నోచుకోకముందే…. తెలుగులో ఏకంగా ఆమె నటించిన రెండు సినిమాలు రిలీజ్ కూడా అయిపోయాయి. కానీ ఈ రెండు సినిమాలు…. ‘చెక్’, ‘ఇష్క్’ ప్రియా ప్రకాశ్ కు విజయాన్ని మాత్రం అందించలేదు. ‘చెక్’ మూవీ పరాజయం కావడంతో ‘ఇష్క్’ మీదనే ఆశలు పెట్టుకుంది ప్రియా ప్రకాశ్. కానీ ‘ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ’ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ‘ఇష్క్’ను చూసి జనాలు… ‘ఇట్స్ ఎ హెడేక్ స్టోరీ’ అని తీర్మానించేశారు. అంతేకాదు… ప్రియా ప్రకాశ్ వారియర్ కు ఫ్లాప్ హీరోయిన్ అనే ట్యాగ్ కూడా వేసేశారు. సినిమాల ఎంపికలో ప్రియా ప్రకాశ్ తెలివిని ప్రదర్శించడం లేదని కొందరంటుంటే… ఆమెను సరిగ్గా గైడ్ చేసే వారు లేరని మరి కొందరంటున్నారు. సినిమా అవకాశాల సంగతి ఎలా ఉన్నా… సోషల్ మీడియాలో మాత్రంలో ప్రియా ప్రకాశ్ చాలానే హంగామా సృష్టిస్తోంది.