అంతర్జాతీయ నటి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ ఇటీవలే ఓ శుభవార్త చెప్పారు. సరోగసి ద్వారా తామో బిడ్డకు తల్లిదండ్రులమయ్యామని ప్రకటించారు. దాంతో వీరికి బాలీవుడ్ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలిపారు. ఈ వార్త చాలామందికి సంతోషాన్ని కలిగించింది, కానీ ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు ఫర్హాన్ అక్తర్, నిర్మాత రితేష్ సిద్వానికి మాత్రం కొంత బాధను మిగల్చబోతోంది. గత యేడాది ఆగస్ట్ లో ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, అలియా భట్ తో తన దర్శకత్వంలో ‘జీ లే జరా’ అనే రోడ్ ట్రిప్ మూవీ చేయబోతున్నానని ఫర్హాన్ అక్తర్ ప్రకటించాడు. ‘దిల్ చాహ్తా హై’, ‘జిందగీ నా మిలేగీ దొబారా’ తరహాలో ఈ రోడ్ ట్రిప్ మూవీ ఉంటుందని, అయితే ఇందులో మహిళలే లీడ్ క్యారెక్టర్స్ చేస్తారని అన్నాడు.
అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే… అతి త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళాల్సి ఉంది. కానీ ప్రియాంక చోప్రా తల్లిగా కొత్త బాధ్యతలను స్వీకరించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ నుండి ఆమె తప్పుకోబోతోందనే వార్తలు బాలీవుడ్ లో షికారు చేస్తున్నాయి. ఇప్పటికే ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వానీకి ప్రియాంక ఈ విషయం చెప్పిందని కొందరంటున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇదంతా పుకారేనని, నిజానికి సరొగసీ ద్వారా తల్లి కాబోతున్న విషయం ప్రియాంకకు ముందే తెలుసు కాబట్టి, ఆ రకమైన బాధ్యతల విషయంలోనూ ఆమె మానసికంగా సంసిద్ధంగా ఉండే ఉంటుందని చెబుతున్నారు. ఏదేమైనా… ‘జీ లే జరా’ ప్రాజెక్ట్ విషయమై పిగ్గీ చాప్స్ నోరు మెదిపితేనే అసలు విషయం తెలుస్తుంది.