NTV Telugu Site icon

లక్షద్వీప్ వాసుల కోసం గొంతెత్తిన పృథ్వీరాజ్!

Prithviraj Sukumaran support to people of Lakshadweep

ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ లక్షద్వీప్ వాసుల కోసం గొంతెత్తాడు. తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా అక్కడి ప్రజల మనోభావాలను ప్రపంచానికి తెలియచేసే ప్రయత్నం చేశాడు. అరేబియా సముద్రంలోని లక్షద్వీప్ యూనియన్ టెర్రీటరీ. అక్కడ ఎంపీగా ఎన్సీపీకి చెందిన మహ్మద్ ఫైజల్ ఎన్నికయ్యారు. అడ్మినిస్ట్రేటర్ గా బీజేపీకి చెందిన ప్రఫుల్ పటేల్ నియమితులయ్యారు. అయితే ఇటీవల లక్ష్యద్వీప్ లో అధికారులు తీసుకొచ్చిన కొత్త సంస్కరణలపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. నేరాలు జరగని ప్రాంతంలో అధికారులు గూండా చట్టాన్ని ప్రవేశ పెట్టి ప్రజలను భయభ్రాతులకు గురి చేస్తున్నారన్నది వారి ప్రధాన ఆరోపణ. ఈ విషయాన్ని నటుడు పృథ్వీరాజ్ దృష్టికి కూడా తీసుకెళ్ళడంతో ఈ స్టార్ హీరో స్పందించాడు. తాను హైస్కూల్ లో చదువుతుండగా తొలిసారి విహార యాత్రకు లక్షద్వీప్ వెళ్ళానని పృథ్వీరాజ్ చెప్పుకున్నాడు. ఆ తర్వాత కూడా సచి ‘అనార్కలీ’ షూటింగ్ కోసం లక్షద్వీప్ కవరత్తిలోనే రెండు నెలల పాటు గడిపానని, అది తనకు లైఫ్ టైమ్ ఎక్స్ పీరియర్స్ ను ఇచ్చిందని తెలిపాడు. తాను దర్శకత్వం వహించిన ‘లూసిఫర్’ మూవీ యాక్షన్ ఎపిసోడ్స్ ను సైతం ప్రజల సహకారంతో లక్షద్వీప్ లోనే చిత్రీకరించానని పృథ్వీరాజ్ చెప్పాడు. తనకు తెలిసిన వారు, తెలియని వారు సైతం లక్షద్వీప్ లో జరుగుతున్న తంతుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నాడు. ఏ సంస్కరణలైనా భూభాగం ఆధారంగా కాకుండా అక్కడ నివసించే వ్యక్తులకు సంబంధించి జరగాలని, వారి మనోభావాలను అధికారులు గ్రహించాలని కోరాడు. తన ద్వారా అక్కడి సమస్య ప్రపంచానికి తెలియాలని స్థానికులు కోరడంతో ఈ పనిచేస్తున్నానని చెప్పాడు. అదే సమయంలో తనకు ఈ వ్యవస్థపై నమ్మకం ఉందని, అంతకు మించిన నమ్మకం ప్రజలపై ఉందని తెలిపాడు. కాబట్టి సంబంధిత అధికారులు లక్షద్వీప్ ప్రజల మాటలను ఆలకించాలని, వారికి ఏది మేలు చేస్తుందో వారి నుండి తెలుసుకోవాలని కోరాడు. మరి పృథ్వీరాజ్ తో మరికెంతమంది ఫిల్మ్ సెలబ్రిటీలు గొంతు కలుపుతారో చూడాలి.