సినిమా వాళ్లకు కూడా ‘సినిమా కష్టాలు’ ఉంటాయి. అందులో ప్రధానమైనవి ‘ఎఫైర్ తంటాలు’! మరీ ముఖ్యంగా, యంగ్ హీరో, హీరోయిన్స్ కి ఎవరితోనో ఒకరితో లింక్ పడిపోతూ ఉంటుంది. అయితే, చాలా వరకూ ఎఫైర్ పుకార్లు నిజాలు అవుతుంటాయి కూడా! వీలైనంత వరకూ మన బాలీవుడ్ బ్యూటీస్ అండ్ బాబులు… బహిరంగా ప్రేమాయణాలే నడుపుతుంటారు. కానీ, ఔను అనకుండా, కాదనకుండా ఫ్రీ పబ్లిసిటీ ఖాతాల్లో వేసేసుకుంటారు! కానీ, కుర్ర హీరో మీజాన్ జాఫ్రీ ఇక నా వల్ల కాదంటూ అసలు విషయం చెప్పేశాడు…
బాలీవుడ్ సీనియర్ నటుడు జావేద్ జాఫ్రీ కొడుకు మీజాన్. త్వరలో ‘హంగామా 2’ చిత్రంలో కనిపించబోతున్నాడు. అయితే, ఈ యంగ్ టాలెంట్ తన ప్రాజెక్ట్స్ వల్ల కంటే ‘రూమర్డ్ గాళ్ ఫ్రెండ్’ నవ్యా నవేలీ నందా కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. నవ్యా నందా అంటే అమితాబ్ మనవరాలు. శ్వేతా బచ్చన్ కూతురు. ఆమెతో మీజాన్ కు సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ చాలా రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పైగా నవ్యా కానీ, మీజాన్ కానీ ‘మా మధ్య ఏం లేద’ని చెప్పకపోవటంతో… పొగను చూసిన వారంతా నిప్పు ఉందనే అనుకున్నారు!
మీజాన్ జాఫ్రి ఓ తాజా ఇంటర్వ్యూలో కుండ బద్ధలు కొట్టేశాడు. నవ్యా నందా తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పాడు. అంతే కాదు, ఆమె తన చెల్లెలు అలవియా జాఫ్రీకి కూడా బెస్టీ అన్నాడు. అసలు తమ మధ్య ఎఫైర్ అంటూ గాసిప్స్ ఎలా మొదలయ్యాయో నాకు అర్థం కాలేదన్న మీజాన్ ఒక దశలో తన తండ్రి కూడా అనుమానంగా చూడటం మొదలెట్టాడని వాపోయాడు. నవ్యకి, తనకి నడుమ ఏదో నడుస్తోందని ఇంట్లో వారు కూడా అనుకోవటంతో అఫిషియల్ గా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తోందని మీజాన్ తేల్చేశాడు. అలాగే, పదే పదే తన కారణంగా నవ్యా నందా పేరు వార్తల్లోకి రావటం ఆమెకి నష్టం కలిగిస్తోందని చెప్పిన యంగ్ హీరో … ఎవరి పర్సనల్ లైఫ్ అయినా మనం గౌరవించాలని అభిప్రాయపడ్డాడు!
మీజాన్ జాఫ్రీ తేల్చి చెప్పాడు కాబట్టి నవ్యతో అతడికి ఎలాంటి రిలేషన్ లేదనే భావించాలి! కాకపోతే, బాలీవుడ్ లో ‘వీ ఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్!’ అంటే… దానర్థమే వేరు! మరి అలా ఈ ఇద్దరు యంగ్ సెలబ్రిటీలు కూడా, ముందు ముందు ఏమన్నా, షాకిస్తారేమో చూడాలి…
అమితాబ్ మనవరాలితో అలాంటిదేం లేదంటోన్న అందగాడు!
