గత యేడాది టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కొత్త కథానాయికలలో వరుస విజయాలతోనే కాదు అవకాశాలతోనూ అగ్రస్థానంలో నిలిచింది శాండిల్ వుడ్ బ్యూటీ కృతీశెట్టి. ‘ఉప్పెన’తో తొలి విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు తొలి సంవత్సరమే ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో మలి విజయాన్ని అందుకుంది. ఇక కొత్త సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన ‘బంగార్రాజు’తో హ్యాట్రిక్ ను అందుకుంది. చిత్రం ఏమంటే ఆమె నటించిన మరో మూడు చిత్రాలు ప్రస్తుతం సెట్స్ పై వివిధ దశల్లో ఉన్నాయి. అందులో ఒకటి సుధీర్ బాబు సరసన నటిస్తున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, మరొకటి రామ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ది వారియర్’. మరొకటి నితిన్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’. ఈ మధ్య కాలంలో ఇలా కొత్తమ్మాయిలు హ్యట్రిక్ సాధించిన సంఘటనలు అరుదు.
కాస్తంత వెనక్కి వెళితే, 2016లో మలయాళీ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ ఇలానే వరసగా తెలుగులో ఎంట్రీ ఇవ్వడమే మూడు విజయాలు తన ఖాతాలో వేసుకుంది. నితిన్ హీరోగా తివిక్రమ్ తెరకెక్కించిన ‘అ…ఆ’తో అనుపమా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందులో సమంత కథానాయిక. అయితే ఈ సినిమాతో పాటే అదే యేడాది విడుదలైన ‘ప్రేమమ్’లోనూ అనుపమా నటించింది. ఈ రెండు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆ తర్వాత సంవత్సరం, 2017లో అనుపమా పరమేశ్వరన్ నటించిన ‘శతమానం భవతి’ మూవీ చక్కని విజయాన్ని అందుకుంది. అలా హ్యట్రిక్ అందుకున్న అనుపమా పరమేశ్వరన్ కు ఆ తర్వాత మాత్రం పెద్దంత కలిసి రాలేదు. నాలుగో సినిమా ‘ఉన్నది ఒకటే జిందగి’ మొదలు పెట్టి, వరుసగా చాలా సినిమాలు ఆ తర్వాత పరాజయం పాలయ్యాయి.
ఇక 2010లో ‘ఏమాయ చేశావె’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత కూడా హ్యాట్రిక్ సాధించింది. మొదటి సంవత్సరమే ఆమె నటించిన ‘ఏ మాయ చేశావె, బృందావనం’ సినిమాలు విజయం సాధించాయి. ఆ తర్వాత సంవత్సరం వచ్చిన ‘దూకుడు’ సైతం సూపర్ హిట్ అయ్యంది. చిత్రం ఏమంటే సమంత హ్యాట్రిక్ తో ఆగిపోలేదు. ఆమె నటించిన నాలుగో సినిమా ‘ఈగ’ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఐదో చిత్రం ‘ఎటో వెళ్ళి పోయింది మనసు’ కమర్షియల్ హిట్ కాలేదు కానీ ఉత్తమ నటిగా ఆమెకు నంది అవార్డును తెచ్చిపెట్టింది. ఇక ఆరో సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సైతం సూపర్ హిట్ అయ్యింది. ఇలా సాగుతున్న కెరీర్ కు పెద్ద బ్రేక్ ‘జబర్దస్త్’ మూవీతో పడింది.
ఏదేమైనా కృతీశెట్టి జోరు చూస్తుంటే… సమంత రికార్డ్ ను బ్రేక్ చేసేలానే కనిపిస్తోంది. నిజం చెప్పలంటే… కృతీశెట్టిని ఇంకా మన దర్శకులు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం మొదలెట్టలేదు. అది జరిగిన రోజున అమ్మడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోవడం ఖాయం. ఆరోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది.