NTV Telugu Site icon

సోనూ సూద్ తో క్రిష్ పాన్ ఇండియా మూవీ!

మ‌న హీరోల‌ను వెండితెర వేల్పులుగా జ‌నం కొలుస్తుంటారు. కానీ చాలామంది ప్ర‌జ‌ల‌కు ఇవాళ సినిమా న‌టుడు సోనూసూద్ ప్ర‌త్య‌క్ష దైవంగా మారిపోయాడు. గ‌త యేడాది క‌రోనా క‌ష్ట‌కాలంలో వ‌ల‌స కార్మికుల‌ను క్షేమంగా ఇంటికి వివిధ మార్గాల్లో చేర్చిన సోనూ సూద్, అప్ప‌టి నుండి త‌న జీవ‌న శైలినే మార్చేసుకున్నాడు. సేవా.. సేవా… సేవా అంటూ అదే ప‌దాన్ని జ‌పిస్తున్నాడు. త‌నకంటూ ఓ బృందాన్ని త‌యారు చేసుకుని దేశంలో ఏ మూల ఎవ‌రు ఏ సాయం కోరినా త‌న‌వంతు కృషిని నూరు శాతం చేస్తూ వారిని క‌ష్టాల నుండి గ‌ట్టెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. అయితే ఈ సేవాత‌త్ప‌రుడిలో ఓ చ‌క్క‌ని న‌టుడు ఉన్నాడ‌నే విష‌యం మ‌ర్చిపోకూడ‌దు.

ఇదే ఉద్దేశ్యంతో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్… సోనూసూద్ కీల‌క‌పాత్ర‌ధారిగా ఓ సూప‌ర్ స‌బ్జెక్ట్ త‌యారు చేశాడ‌ట‌. దీనిని సోనూసూద్ కు వినిపించ‌గానే అత‌ను కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ఓ క్రేజీ పాన్ ఇండియా మూవీ త‌యార‌వుతుంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. గ‌తంలో సోనూసూద్… క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘మ‌ణిక‌ర్ణిక‌’ చిత్రంలో కీల‌క పాత్ర పోషించాడు. అనివార్య ప‌రిస్థితుల్లో క్రిష్ ఆ ప్రాజెక్ట్ నుండి బ‌య‌ట‌కు రావ‌డం సోనూ సూద్ ను సైతం బాధ‌కు గురిచేసింది. ఈ సారి మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరిద్ద‌రి ప్రాజెక్ట్ భారీ స్థాయిలో తెర‌కెక్క‌బోతోంద‌ని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే… క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తున్న‌ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ చిత్రం ప్ర‌స్తుతం సెట్స్ పై ఉంటే, వైష్ణ‌వ్ తేజ్ తో క్రిష్ తీసిన ‘కొండ‌పొలం’ న‌వ‌లా చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. ఇక దిల్ రాజు, క్రిష్ సంయుక్తంగా నిర్మించిన ‘101 జిల్లాల అంద‌గాడు’ మూవీ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.