దాదాపు రెండేళ్ళ తర్వాత ప్రముఖ నటి హరిత జీ తెలుగులోకి తిరిగి ఎంటర్ అవుతున్నారు. గతంలో అఖిలాండేశ్వరిగా జీ వీక్షకులను ఆకట్టుకున్న హరిత ఇప్పుడు ‘కళ్యాణం కమనీయం’ సీరియల్ లోని సీతారత్నం పాత్రతో వారి ముందుకు వస్తున్నారు. ఈ సీరియల్ లో నటించడం, అది జీ తెలుగులో ప్రసారం కావడం తనకు పుట్టింటికి వచ్చిన అనుభూతిని కలిగిస్తోందని హరిత చెబుతున్నారు.
ఇక ‘కళ్యాణం కమనీయం’ సీరియల్ విషయానికి వస్తే… ఇది ఓ తల్లి, ఇద్దరు కూతుళ్ళకు సంబంధించిన కథ. సీతారత్నం (హరిత) ఓ సాధారణ గృహిణి. ఓ శరణాలయాన్ని నడుపుతూ ఉంటుంది. అందరూ బాగుండాలని కోరుకునే మహిళ. మరో వైపు చైత్ర (మేఘనా లోకేష్) ఫిజియోధెరపిస్ట్. తన తండ్రి (సింగర్ మనో) ఆఖరి నిమిషంలో తనకు, తన చెల్లికి వారి అమ్మకు సంబంధించిన నిజాన్ని వెల్లడిస్తాడు. అలా ఆ అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ తమకు తెలియని అమ్మను గురించి వెదకడం ప్రారంభిస్తారు. విధి ఆడిన వింత నాటకంలో వీరు సీతారత్నం చెంత చేరతారు. అయితే సీతారత్నం కోసం రాక్ స్టార్ విరాజ్ (మధు)తో తలపడుతుంది చైత్ర. ఆ వైరం చివరకు వారి మధ్య ప్రణయానికి దారితీస్తుంది. చిన్నప్పుడే పిల్లలను కోల్పోయిన సీతారత్నంకు వారు దొరికారా? తల్లి కోసం చైత్ర, ఆమె చెల్లి సాగిస్తున్న అన్వేషణ సఫలీకృతం అయ్యిందా? రాక్ స్టార్ విరాజ్ డాక్టర్ చైత్ర మధ్య ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారితీసింది? ఇదే ‘కళ్యాణం కమనీయం’ సీరియల్ కథ. లవ్, మదర్ సెంటిమెంట్ తో మిళితమైన ఈ సీరియల్ జనవరి 31వ తేదీ నుండి రాత్రి 7.30కి జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం కాబోతోంది. కొత్త సంవత్సరంలో మొదలవుతున్న ఈ కొంగొత్త సీరియల్ తప్పకుండా వీక్షకుల హృదయాలను గెలుచుకుంటుందనే ఆశాభావాన్ని జీ తెలుగు సంస్థ వ్యక్తం చేస్తోంది.