NTV Telugu Site icon

హార్బ‌ర్ బ్యాక్ డ్రాప్ లో, నాలుగు భాష‌ల్లో జెట్టి

సుబ్ర‌హ్మ‌ణ్యం పిచ్చుక ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వేణుమాధ‌వ్ నిర్మించిన మూవీ ‘జెట్టి’. సౌత్ ఇండియా లో తొలి హార్బ‌ర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమా ఇదని నిర్మాత చెబుతున్నారు. ఈ మూవీ టైటిల్ లోగోను ఇటీవ‌ల‌ తెలుగు, తమిళ‌, మ‌ల‌యాళ, క‌న్న‌డ భాష‌ల్లో చిత్రం బృంద‌మే విడుద‌ల చేసింది. దక్షిణ భారత దేశంలోనే ఇప్పటివరకు రాని సరికొత్త సముద్ర‌పు నేప‌థ్య చిత్రాన్ని నాలుగు భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నామ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలిపారు. అనాదిగా వ‌స్తున్న ఆచారాల‌ను న‌మ్ముకొని జీవితం సాగిస్తున్న మ‌త్స్య కారుల క‌థ‌ను ద‌ర్శ‌కుడు సుబ్ర‌హ్మ‌ణ్యం వెండితెర‌పై ఆవిష్క‌రించాడ‌ని, ప్రపంచీక‌ర‌ణతో మారుతున్న జీవ‌న‌శైలిలో తాము న‌మ్ముకున్న స‌ముద్రం మీద ఆధార ప‌డుతూ, అల‌లతో పోటీ ప‌డ‌తూ పొట్ట బోసుకుంటున్న జీవితాల‌ను అంతే స‌హాజంగా తెర‌మీద చూపించామ‌ని నిర్మాత వేణుమాధ‌వ్ అన్నారు. మత్స్యకారుల జీవన విధానాల్ని, వారి కట్టుబాట్లని, వారు పడే కష్టాలకు పరిష్కారం ఏంటో తెలియచెప్పటమే ప్రధానాంశంగా రూపొందిన చిత్రం జెట్టి అని చెప్పారు.

`కొన్ని వందల గ్రామాలు, కొన్ని వేల మత్స్యకార కుటుంబాలు, కొన్ని త‌రాల పోరాటం, వారి క‌ల అయిన ఒక గోడ, ఆ గోడ పేరే జెట్టి అని ద‌ర్శ‌కుడు సుబ్ర‌హ్మ‌ణ్యం తెలిపారు. ఈ సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట హైలైట్ గా నిలుస్తుంద‌ని త్వ‌ర‌లోనే దానిని విడుద‌ల చేస్తామ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు చెప్పారు. నందితా శ్వేత ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాతో కృష్ణ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు.