సినిమాటోగ్రఫీ చట్టం-1952ను సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రదర్శనలకు కేంద్రీయ చలన చిత్ర ధ్రువీకరణ సంస్థ (సి.బి.ఎఫ్.సి) జారీ చేసే ధ్రువపత్రాల అధికారం.. కేంద్రం అధీనంలోకి తీసుకుంటూ చట్టాన్ని రూపొందించాలన్న నిర్ణయంపై సినీ పరిశ్రమలో అసంతృప్తి రగులుతోంది. దీనిపై సినిమా ప్రముఖులు బహిరంగంగానే తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే దీనిపై తమిళ స్టార్ హీరో సూర్య రీసెంట్ గా స్పందించారు. ఇది భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై సూర్య అభిమానులు కూడా మద్దతుగా నిలిచారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సూర్య వ్యతిరేకిస్తున్నాడు అంటూ తమిళ బీజేపీ యువజన విభాగం నేతలు మండిపడుతున్నారు. సూర్య తన సినిమాల గురించి మాత్రమే పట్టించుకుంటే మంచిదని.. అంతేగానీ, ఇతర విషయాలపై అనవసరమైన కామెంట్స్ చేస్తూ తప్పుదోవ పట్టించొద్దంటూ కోరారు. సూర్య తన తీరును మార్చుకోకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మరి దీనిపై సూర్య ఏమైనా స్పందిస్తారామె చూడాలి!
సూర్య స్వేచ్ఛ మాటలపై.. బీజేపీ నేతల రచ్చ!
