Site icon NTV Telugu

నా పిల్లలకి కాలుష్యంతో నిండిన ఈ భూమి వద్దంటోన్న… భూమి పెడ్నేకర్!

Bhumi Pednekar: Wouldn’t want to raise my kids in polluted world

‘’కలుషితమైన భూమిపై నా పిల్లలు పెరగకూడదు!’’ అంటోంది భూమి పెడ్నేకర్. అఫ్ కోర్స్, మిస్ భూమి పెడ్నేకర్ కి ఇంకా పెళ్లి కాలేదు. కానీ, ఇప్పట్నుంచే తన వారసుల కోసం పచ్చటి ప్రపంచాన్ని సిద్ధం చేస్తోంది బీ-టౌన్ గ్రీన్ ఏంజిల్! ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆమె తన మనసులోని మాటల్ని బయట పెట్టింది.
భూమి చదువుకునే రోజుల్లో టీచర్లు, పెరెంట్స్ నీరు, విద్యుత్, ఆహారం వంటివి వృథా చేయవద్దనే చెప్పేవారట. అలాగే, చిన్నప్పుడు భూమి పర్యావరణం గురించి ఎక్కువగానే ఆలోచించేదట. మనకున్న ఏకైక నివాస యోగ్యమైన గ్రహంపై వేడి ఎక్కువైతే? లేదా నీటి మట్టం పెరిగిపోతే? ఇలా పలు ప్రశ్నలు వేసుకునేదట! అందుకే, ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా తనకున్న ఇమేజ్ ను పర్యావరణ పరి రక్షణకు ఉపయోగిస్తోంది భూమి. తాను మంచి పనులు చేయటమే కాదు తన ఫాలోయర్స్ చేత కూడా మరింత పచ్చటి ప్రపంచం కోసం అడుగులు వేయిస్తోంది!

చెట్లు నాటాలి, ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి, ప్రకృతి పట్ల మరింత బాధ్యతగా ఉండాలి అని చెప్పే భూమి పోయిన సంవత్సరం కూడా ఆన్ లైన్ ఉద్యమం చేపట్టింది. ఈసారి కూడా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మరోసారి భూమాత పట్ల తన భక్తిని చాటుకుంది భూమి పెడ్నేకర్. ఇప్పటికే తాను నటించిన చిత్రం ‘బదాయి దో’ సెట్స్ పైన ‘నో ప్లాస్టిక్’ రూల్ అమలు చేయించింది యంగ్ యాక్ట్రస్. అంతే కాదు, మరో పర్యావరణ ఉద్యమకర్తతో కలసి ఆమె గాల్లోని విషపూరిత కణాల్ని ఇంక్ గా మార్చే ఉద్యమం చేపట్టింది. 2021 పర్యావరణ దినోత్సవం సందర్భంగా పదేళ్ల గ్రీన్ ప్లాన్ ప్రకటించింది. ఇక మీదట మరిన్ని చెట్లు నాటటం, తన పాలోయర్స్ చేత నాటించటం, నీటి వనరుల వృథాని అరికట్టడం, ప్లాస్టిక్ వాడకాన్ని సాధ్యమైనంత తగ్గించటం భూమి ముందున్న కర్తవ్యాలట!

నిత్యం గ్లామర్ ప్రపంచంలో మునిగితేలే సినిమా హీరోయిన్ నిజమైన ప్రపంచం, అందులోని సవాళ్ల గురించి మాట్లాడటం హర్షించాల్సిన విషయమే. భూమి లాంటి కథానాయికలు కొద్ది మందే ఉంటారు. అలాగే, తాను ఎలాంటి స్వచ్ఛమైన ప్రపంచంలో పెరిగి పెద్దైందో… అటువంటి చక్కటి పర్యావరణాన్ని తన పిల్లకు కూడా అందిస్తానంటోంది! ఇది కేవలం ఆమె మాత్రమే కాదు… అందరూ కంకణం కట్టుకోవాల్సిన కర్తవ్యం!

Exit mobile version