సినిమా లేకపోతే ఈరోజు ప్రజల్లో తన ఉనికి ఉండేది కాదని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. నిజమైన కళాకారుడికి కులం, మతం, ప్రాంతం అనేది పట్టదని అన్నారు. ఎక్కడో చెన్నైలో ఉండే చిత్రపరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకురావడంతో ఎందరో సినీ పెద్దలతో పాటు చెన్నారెడ్డి లాంటి మహనీయులు తోడ్పాటు అందించారని.. అలాంటి సినిమా ఇండస్ట్రీకి కేసీఆర్ లాంటి వాళ్లు సహకారం అందించడం ఎంతో సంతోషంగా ఉందని పవన్ అన్నారు.
తొలిప్రేమ, ఖుషి సినిమాలను ఎంత బాధ్యతగా తీశామో.. ఇప్పుడు భీమ్లానాయక్ సినిమాను కూడా రాజకీయాల్లో ఉంటూ అంతే బాధ్యతగా తీశామని పవన్ తెలిపారు. ఈ మూవీకి కష్టపడి పని చేసిన టెక్నీషియన్‌లు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలో చదువుకుంటూ సినిమా మీద ప్యాషన్‌తో తెలుగు చిత్ర పరిశ్రమలో బలమైన దర్శకుడిగా రూపుదిద్దుకుంటున్న సాగర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. భీమ్లానాయక్ సినిమా అనేది అహంకారానికి, ఆత్మాభిమానానికి మధ్య జరిగే మడమ తిప్పని యుద్ధమన్నారు. ఒక పోలీస్ అధికారికి, కాబోతున్న రాజకీయ నేపథ్యంలో ఉండే వ్యక్తికి మధ్య జరిగే సంఘర్షణను చాలా బాగా రచన చేసిన త్రివిక్రమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు వెన్నెముకగా నిలిచారని.. ఆయన లేకపోతే ఈ సినిమా లేదన్నారు. అటు ఈ ఫంక్షన్‌కు ముఖ్య అతిథులుగా వచ్చిన మంత్రులు కేటీఆర్, తలసానితో పాటు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్‌లకు ధన్యవాదాలు తెలియజేశారు.