బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ వ్యవహారం గాలివానగా మారుతోందా? చూస్తుంటే అదే అనిపిస్తోంది. తాజాగా దర్శకుడు అనుభవ్ సిన్హా యంగ్ హీరోకి మద్దతుగా ట్వీట్ చేశాడు. సోషల్ మీడియాలో ఆయన పెకిలించిన గొంతుకి క్రమంగా మద్దతు పెరుగుతోంది. చాలా మంది సుశాంత్ కు జరిగిందే కార్తీక్ కు జరుగుతోంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మొదట ధర్మా ప్రొడక్షన్స్ ‘దోస్తానా 2’ నుంచీ, తరువాత రెడ్ చిల్లీస్ ‘ఫ్రెడ్డీ’ మూవీ నుంచీ కార్తీక్ ను తప్పించారు ఫిల్మ్ మేకర్స్. అయితే, ధర్మా, రెడ్ చిల్లీస్ సంస్థలు కరణ్ జోహర్, షారుఖ్ ఖాన్ కు సంబంధించిన బ్యానర్స్ కావటంతో ఇప్పుడు కార్తీక్ పై ఉద్దేశపూర్వకమైన కుట్ర జరుగుతోంది అంటూ వాదించే వారి సంఖ్య పెరుగుతోంది. సామాన్య నెటిజన్సే కాదు బాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుభవ్ సిన్హా కూడా కార్తీక్ వైపు నిలబడ్డాడు. అతడిపై బాలీవుడ్ పెద్దలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని సూటిగా మాట్లాడాడు. అనుభవ్ సిన్హా తన ట్వీట్ లో ‘ఏ ఫిల్మ్ మేకర్ కూడా తన నటీనటుల్ని ప్రాజెక్ట్ నుంచీ తప్పించాల్సి వస్తే పబ్లిగ్గా ప్రకటించరు. యాక్టర్స్ సినిమా నుంచీ తప్పుకుంటే కూడా బయటకు వచ్చి మాట్లాడరు. ఇప్పుడు జరుగుతోన్నదంతా కార్తీక్ పై ఉద్దేశ్యపూర్వకమైన కుట్రే!’’ అన్నాడు.
ఇంత వరకూ కార్తీక్ విషయంలో జరుగుతోన్న దాని గురించి బాలీవుడ్ లో ఎవరూ స్పందించలేదు. కార్తీక్ ఆర్యన్ కూడా స్వయంగా ఇంకా ఎటువంటి కామెంట్ చేయలేదు. మరి అనుభవ్ సిన్హాతో పాటూ ఇంకా కొన్ని గొంతుకలు యంగ్ హీరోకి మద్దతు పలుకుతాయా? కంగనా లాంటి వారు రంగంలోకి దిగితే ఈ గొడవ పెద్ద రచ్చే అవుతుంది. చూడాలి మరి, ముందు ముందు బీ-టౌన్ లో ఎవరెవరు ఎలా వ్యవహరిస్తారో? కార్తీక్, కరణ్, షారుఖ్ లాంటి వారి వాదనలు ఎలా ఉంటాయో!