NTV Telugu Site icon

ఆయనకి అవార్డ్… ఆడవాళ్లు సీరియస్!

Actresses question ONV award to Vairamuthu

ఆయన పేరే వైరముత్తు. అందుకేనేమో చాలా మందికి అతడితో వైరం ఏర్పడింది. అఫ్ కోర్స్, ఆయన మీద వచ్చిన ఆరోపణలు కూడా అంతే సీరియస్ లెండీ! తమిళ గీత రచయిత వైరముత్తు వివాదం గురించి కొత్తగా చెప్పేదేముంది? ఆయనపై సింగర్ చిన్మయి శ్రీపాద లైంగిక ఆరోపణలతో ‘మీ టూ’ వ్యవహారం మొదలైంది. తరువాత దాదాపు 16 మంది మహిళలు వైరముత్తుపై లైంగిక వేధింపు ఆరోపణలు చేశారు. అయితే, అవేవీ ఆయన్ని జైలుకో, కోర్టుకో తీసుకెళ్లలేకపోయాయి. కానీ, వైరముత్తు గతంలోని చీకటి కోణాలు వృత్తి పరంగా మాత్రం ఆయన్ని విడిచి పెట్టడం లేదు.

ఎన్నో అద్భుతమైన పాటలు రాసిన వైరముత్తుకు తాజాగా ‘ఓఎన్ వీ లిటరరీ అవార్డ్’ ప్రకటించారు. ఈ అవార్డ్ 2016లో మరణించిన లెజెండ్రీ రైటర్ ‘ఓఎన్ వీ కురుప్’ పేరు మీదుగా ప్రతి ఏటా ఇస్తుంటారు. కానీ, ఈ సంవత్సరం వైరముత్తుకు ప్రతిష్ఠాత్మక సాహిత్య పురస్కారం ప్రకటించటం చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. ఎందరో తీవ్రమైన ఆరోపణలు చేసిన ఒక వ్యక్తికి అంతటి అవార్డ్ ఎలా ఇస్తారంటూ సొషల్ మీడియాలో నిరసనలు తెలుపుతున్నారు. పార్వతీ అనే తమిళ నటి ఇన్ స్టాగ్రామ్ లో వైరముత్తును తీవ్రంగా విమర్శించింది. ఓఎన్ వీ కురుప్ ఒక రచయితగా తమిళ సంస్కృతిని ఎంతో సుసంపన్నం చేశారు. అటువంటి గొప్ప రైటర్, లిరిస్ట్ పేరున ఏర్పాటు చేసిన అవార్డ్ లైంగిక వేధింపు ఆరోపణలు ఎదుర్కొంటోన్న వారికి ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించింది.

డైరెక్టర్ అంజలి మెనన్, ఫిల్మ్ మేకర్ గీతూ మోహన్ దాస్, నటి రీమా కల్లింగల్, సింగర్ చిన్మయి శ్రీపాద కూడా వైరముత్తుకు వ్యతిరేకంగా తమ నిరసనల్ని గట్టిగానే వినిపించారు. జరుగుతోన్న పరిణామాల దృష్ట్యా ఓఎవన్ వీ అవార్డ్ ప్రకటించిన జ్యూరి ప్రస్తుతం వైరముత్తు పేరును పునః పరిశీలిస్తోందని సమాచారం. ఆయనకు ప్రకటించిన అవార్డును వెనక్కి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయట. చూడాలి మరి, ఏమవుతుందో! కాకపోతే, ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపు ఏంటంటే… ఈ మధ్యే సీఎం అయిన ఎంకే స్టాలిన్… ప్రతిష్ఠాత్మక అవార్డు పొందిన వైరముత్తుకు శుభాకాంక్షలు తెలపటం!