ఆది సాయికుమార్ ‘బుర్రకథ’తో పాటు, ఇ, ఈ
చిత్రంలో నటించిన నైరా షాను పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. బోయ్ ఫ్రెండ్ ఆషిక్ సాజిద్ హుస్సేన్ తో జుహూలోని ఓ స్టార్ హోటల్ లో ఆమె చరస్ ను తీసుకుంటుండగా పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. ఆదివారం రాత్రి నైరా షా జుహూలోని ఓ స్టార్ హోటల్ లో తన పుట్టిన రోజు పార్టీని ఇచ్చిందని, అక్కడ డ్రగ్స్ వాడుతున్న సమాచారం తమకు లభించడంతో సోమవారం తెల్లవారుఝామున 3 గంటలకు హోటల్ లోని గదిని సోదా చేయగా, ఒక గ్రామ్ చరస్ ను సిగరెట్ లో చుట్టి తీసుకోవడం గమనించామని పోలీసులు చెప్పారు. నైరా షా, ఆమె స్నేహితులకు ఏదైనా డ్రగ్ రాకెట్స్ తో సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని ఆరా తీస్తున్నామని అరెస్ట్ చేసిన శాంతక్రజ్ పోలీసులు అన్నారు. ఐపీసీ సెక్షన్ 274 ప్రకారం డ్రగ్స్ ను తయారు చేయడం, వాడటం, అమ్మడం, సరఫరా చేయడం, దాచడం నిషేధమని, వారి దగ్గర డ్రగ్స్ లభించడంతో అదే సెక్షన్ కింద కేసు నమోదు చేశామని చెప్పారు. అరెస్ట్ అనంతరం కోర్టులో హాజరు చేయడానికి ముందు నైరా, ఆషిక్ లను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. నైరా శరీరంలో మోతాదుకు మించిన మత్తు పదార్థాలు ఉన్నాయని తెలిసిందన్నారు పోలీసులు. అయితే సోమవారం స్థానిక బాంద్రా కోర్టు నుండి నైరా షా బెయిల్ సంపాదించింది. దానితో వీరికి డ్రగ్స్ ఎలా లభ్యమయ్యాయనే దిశగా పోలీసులు పరిశోధన చేస్తున్నారు.
డ్రగ్స్ వాడుతూ పోలీసులకు చిక్కిన నటి!
