“ఆదిత్య”, “విక్కీస్ డ్రీమ్”, “డాక్టర్ గౌతమ్” వంటి సందేశాత్మక బాలల చిత్రాలతో పిల్లల మనసుల్లో మంచి విత్తనాలు నాటి, తల్లిదండ్రుల ప్రశంసలతో పాటు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సాధించిన దర్శకుడు, నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ మరోసారి సమాజానికి సందేశం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో, సంతోష్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆయన రూపొందిస్తున్న తాజా బాలల చిత్రం “అభినవ్ (Chased Padmavyuha)”. సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్, గీతా గోవింద్, అభినవ్, చరణ్, బేబీ అక్షర ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిలిమ్ ఛాంబర్లో ప్రెస్ మీట్ నిర్వహించారు.
దర్శక, నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ: “డ్రగ్స్ అనే భూతం మన సమాజాన్ని కబళిస్తోంది. విద్యార్థులను కూడా వదలకుండా, డ్రగ్ మాఫియా మన దేశ భవిష్యత్‌ను నాశనం చేయాలని చూస్తోంది. ఇందులో అంతర్జాతీయ కుట్రల సూచనలూ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి మాఫియా బాగా విస్తరించింది. ఈ చిత్రంలో అభినవ్ అనే సాహస బాలుడు, తన స్వాతంత్య్ర సమరయోధుడైన తాతయ్య నారాయణరావు స్ఫూర్తితో, స్నేహితులతో కలిసి గంజాయి మాఫియాకు ఎలా చెక్ పెట్టాడనేది ఉత్కంఠగా చూపించాం. అభినవ్ సాహసాలు పిల్లలతో పాటు పెద్దలనూ ఆకట్టుకుంటాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ రహిత సమాజం కోసం సినిమా వాళ్లు చిన్న వీడియో చేయాలని కోరారు. నేను నా వంతుగా ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించాను. డ్రగ్స్ గ్రామాల్లోనూ వ్యాపిస్తున్న నేపథ్యంలో, పిల్లలు ఎన్సీసీ, స్కౌట్స్, యోగ, ధ్యానం వంటివి నేర్చుకుంటేనే చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారు. అక్షరాస్యత లేకపోవడం కూడా మన దేశం వెనకబడటానికి ఒక కారణం. పిల్లలను చదివించి, దేశాన్ని అగ్రగామిగా నిలపాలి. ఈ అంశాలన్నీ ‘అభినవ్’లో హైలైట్ చేశాం. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి, నవంబర్ 14న చిల్డ్రన్స్ డే రోజున రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. విద్యార్థులకు ఈ చిత్రాన్ని చూపించి, వారిలో మంచి ఆలోచనలు పెంచి, డ్రగ్స్ లాంటి వ్యసనాల నుంచి దూరంగా ఉండేలా చేయాలన్నదే మా లక్ష్యం. అలాగే, రాణి రుద్రమదేవి స్ఫూర్తితో 30 ఏళ్లుగా రాజకీయ జీవితం కొనసాగిస్తున్న మంత్రి కొండా సురేఖ గారికి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇవ్వడం ఆనందంగా ఉంది” అని అన్నారు.