NTV Telugu Site icon

Yupp tv CEO : సమ్మక్క-సారక్క జాతర మా తాత ఏర్పాటు చేశారు

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల పై గత రెండు రోజులుగా రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణపై స్థల యజమానుల్లో ఒకరైన Yupp tv CEO ఉదయానందన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నలభై సంవత్సరాలుగా మా కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న జాతర స్థలం పూర్తిగా మా కుటుంబ సభ్యులదే‌నని ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ స్థలంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జోక్యంతో రిన్నోవేషన్ కమిటీ ఏర్పాటు చేసి పనులు చేపట్టారని, ప్రైవేటు స్థలంలో ఇతరులు పని చేయడాన్ని సవాలు చేస్తూ మేము హైకోర్టును ఆశ్రయించామన్నారు. హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పాటు జాతర కూడా మేమే నిర్వహించాలని చెప్పిందని ఆయన పేర్కొన్నారు. 1975 లో మా తాత సుధాకర్ రెడ్డి ఈ జాతరను ఏర్పాటు చేశారని, ఆ తర్వాత మా పెద్దనాన్న రామకృష్ణారెడ్డి ఇప్పటివరకు జాతర నిర్వహిస్తూ వస్తున్నారని ఆయన తెలిపారు.

ఈ సారి కూడా మా పెదనాన్న ఆధ్వర్యంలోనే విధిగా వీణవంక సమ్మక్క జాతర నిర్వహిస్తామన్నారు. జాతర జరిగే స్థలం పూర్తిగా పాడి కుటుంబ సభ్యులకు సంభందించిన ప్రైవేట్ పట్టా లాండ్ అని హై కోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన అన్నారు. జాతరను ఎండోమెంట్ వారు కేవలం పర్యవేక్షించవచ్చు తప్ప ఎలాంటి జోక్యం చేసుకోరాదని కోర్టు చెప్పిందని, మా తాతగారైన పాడి సుధాకర్ రెడ్డి కుటుంబంతో పాడి కౌశిక్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ అగ్ర నాయకత్వానికి, ఉన్నత అధికారులకు పాడి సుధాకర్ రెడ్డి మా తాత అని పాడి కౌశిక్ చెప్పుకుంటున్నారని, నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఈ విషయం గుర్తించాలన్నారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కల్పించాలని, ఈ విషయంలో ఇవాళ ఉదయం కరీంనగర్ పోలీస్ కమిషనర్‌ను, కలెక్టర్‌ను కలిసి విన్నవించామన్నారు.