YS Sharmila Slams CM KCR Over Podu Bhumulu: పోడు భూముల వ్యవహారంలో సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దండేపల్లి మండలం కోయపోషగూడెం రైతులతో నేరుగా మాట్లాడిన షర్మిల.. పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా, ఇంతవరకు ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదని కేసీఆర్‌ని దుయ్యబట్టారు. 2002 నుంచి ఈ పోడు భూములను రైతులు సాగు చేసుకుంటున్నారని, ఇప్పటిదాకా పట్టాలివ్వకపోవడం మహా దారుణమని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంటే, ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. కచ్ఛితంగా రైతుల చేతుల్లో పట్టాలు పెట్టేవారని తెలిపారు.
ఈ భూములు పోరాడుతోన్న 52 కుటుంబాల్ని హింసిస్తున్నారని, మహిళల్ని జైల్లో పెట్టి మరీ చిత్రహింసలకు గురి చేస్తున్నారని షర్మిల ఆగ్రహించారు. వైఎస్సార్ ఇచ్చిన ఇళ్లను సైతం వదిలిపెట్టి, ఇక్కడే గుడిసెలు వేసుకుని రైతులు జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు. పోడు పట్టాలు అడిగితే, గొడ్డలితో నరికేస్తరా..? అంటూ నిలదీశారు. పాలిచ్చే తల్లులని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారని, ఆడవారికి కనీసం రక్షణ లేదని కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. మనుషులు ఉండే సమాజమన్న సోయి సర్కారుకి లేదని, కేసీఆర్ ఉంచి కూడా సచ్చినట్లే సమానమంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆనాడు పోడు భూములకు కుర్చీ వేసుకొని కూర్చొని పట్టాలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ 8 ఏళ్లుగా ఒక్క ఎకరాకు కూడా పట్టాలు ఇవ్వలేదని షర్మిల ఆగ్రహించారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకొలేని సర్కార్ ఎందుకు..? అని ప్రశ్నించారు. పోడు పట్టాలపై కేసీఅర్ ఇప్పుడు కొత్త మాట మాట్లాడుతున్నారని, పోడు చట్టాలు మార్చాలంటున్నారని షర్మిల అన్నారు. కానీ వైఎస్సార్ మాత్రం వైఎస్సార్ ఇదే చట్టంతోనే పోడు భూములకు పట్టాలిచ్చారని, మరి మీకెందుకు చేత కావడం లేదంటూ ఎద్దేవా చేశారు. పట్టాలు కావాలని అడిగితే చీరలు లాగుతారా..? ఇది మహాభారతమా..? ఇదేమైనా ధృతరాష్ట్ర పాలననా..? అంటూ వరుస ప్రశ్నలు సంధించారు.
ఓట్ల కోసమే కేసీఆర్ బూటకపు హామీలు ఇస్తున్నారని, గాడిదకు రంగు పూసి, ఇదే ఆవు అని కేసీఆర్ నమ్మిస్తాడని కౌంటర్ వేశారు. కేసీఆర్‌కు మాట మీద నిలబడటమేంటో తెలియదని, ఈ భూములు మీవేనని, పోరాటం చేయండని, మీ పక్షాన తామూ పోరాటం చేస్తామని షర్మిల పిలుపునిచ్చారు. ఎన్నికలొస్తున్నాయి కాబట్టి కేసీఆర్ మళ్లీ వచ్చి డబ్బులు బాగా పంచుతారని, అవి తీసుకొని మీకోసం తపన పడే వారికే ఓటు వేయండని షర్మిల సూచించారు.
