Site icon NTV Telugu

YS Sharmila: రాజా సింగ్ ఒక కమెడియన్.. ఇదంతా కేసీఆరే నడిపిస్తున్నారు

Sharmila On Raja Singh

Sharmila On Raja Singh

YS Sharmila Fires On MLA Raja Singh Issue: ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంపై తాజాగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. రాజా సింగ్ ఒక కమెడియన్ అని.. ఎమ్మెల్యే స్థాయి చేతకాకపోతే కమెడియన్‌గా ఉండండని హితవు పలికారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతోందన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి.. ఆ చిచ్చులో చలి కాచుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నో మతాలకు, ఎన్నో సంప్రదాయాలకు నిలయమైన రాష్ట్రమని.. ఇలా ప్రశాంతంగా ఉంచడం బీజేపీకి ఇష్టం లేదని ఆరోపించారు. బీజేపీ ఒక మత పార్టీ, మత పిచ్చి ఉన్న పార్టీ అని రుజువైందని అన్నారు. మతం పేరు చెప్పి, రాజకీయం చేస్తారని నిరూపితమైందని చెప్పారు.

ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడకూడని మాటలు విన్నామని.. ఎమ్మెల్యే అంటే ఒక నియోజక వర్గ ప్రజలకు, అన్ని కులాలు, మతాల వారికి ఎమ్మెల్యే అని షర్మిల అన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టేలా రాజా సింగ్ మాట్లాడటం సరి కాదన్నారు. అతనిపై బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకుందో క్లారిటీ లేదన్న ఆమె.. సస్పెండ్ చేశాం, షో కాజ్ నోటీస్ ఇచ్చామని బీజేపీ అంటోందని, సస్పెండ్ చేస్తే క్లియర్‌గా చెప్పాలని బీజేపీని అడిగారు. షో కాజ్ నోటీస్ అంటే.. వివరణ ఇచ్చుకో అని చెప్తున్నారా?అంటూ నిలదీశారు. గతంలో బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడుగా ఉండి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. మసీదులు తవ్వుకుంటూ పోదాం.. శవాలు వస్తె మీవి.. శివ లింగాలు వస్తె మావి అన్నారని.. అయినా ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. రాజా సింగ్ కూడా గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. ఆయన ముస్లిం మతాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారని చెప్పారు. బీజేపీకి ఓట్లు వేయకపోతే బుల్డోజర్‌తో నాశనం చేస్తానని రాజా సింగ్ అన్నారని.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలా ఆయనిలా మాట్లాడుతున్నారని అన్నారు.

ఒక మతాన్ని సైడ్ తీసుకొని బీజేపీ ఒకవైపే ఎలా మాట్లాడుతుందని షర్మిల ఫైరయ్యారు. ఓల్డ్ సిటీలో మళ్ళీ చిచ్చు పెడుతున్నారని, ఇదేనా బీజేపీకి చేతనైన రాజకీయమని ప్రశ్నించారు. రాజా సింగ అంశాన్ని గవర్నర్ చాలా సీరియస్‌గా తీసుకోవాలని, స్పీకర్ కూడా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి వాళ్ళను సమాజం సహిస్తే గొడవలు పెరుగుతూ ఉంటాయని హెచ్చరించారు. వైఎస్సార్ హయాంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని, కేసీఅర్ మాత్రం ముస్లింలను ఘోరంగా మోసం చేశారని ఆరోపించారు. 12 శాతం రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి ఫెయిలయ్యారన్నారు. కవిత లిక్కర్ వ్యాపారాన్ని మళ్లించడానికి కేసీఆర్ ఈ రాజా సింగ్ అంశాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. రాజా సింగ్ వెనుక కేసీఅర్ ఉన్నారని చర్చ జరుగుతోందని, డైవర్షన్ స్కీమ్ కింద రాజా సింగ్ ఎపిసోడ్ తీసుకొచ్చారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మతాలు పేరు చెప్పి రాజకీయం చేయండి కానీ.. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను మాత్రం రాజకీయాలకు వాడుకోకండని షర్మిల హితవు పలికారు.

Exit mobile version