YS Sharmila Comments On DK Aruna: ‘వైఎస్సార్ బిడ్డ తెలంగాణలో ఏం పని’ అని డీకే అరుణ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా స్పందించారు. తాను వైఎస్సార్ బిడ్డనని, తెలంగాణ గడ్డ మీదే పెరిగానని, ఇక్కడే చదువుకోవడంతో పాటు తన బిడ్డకు కూడా జన్మనిచ్చానని చెప్పారు. తన బ్రతుకు, గతం ఇక్కడేనని చెప్పిన ఆమె.. తెలంగాణలో వైఎస్సార్ పాలన లేదు కాబట్టే పార్టీ పెట్టానని అన్నారు. తెలంగాణ కోసం వైఎస్సార్ కుటుంబం ఏం చేసిందని అరుణ అడుగుతున్నారని.. అసలు గద్వాల్ ప్రజల కోసం మీరేం చేశారో చెప్పాలని తిరిగి ప్రశ్నించారు.
అసలు డీకే అరుణను రాజకీయంగా పైకి తెచ్చిందే వైఎస్సార్ అని షర్మిల అన్నారు. వైఎస్సార్ బిడ్డ తెలంగాణ రాజకీయాలకు రావడం అరుణకి నచ్చనట్టుందని సెటైర్ వేశారు. 2018లో బీజేపీ నాయకుడొకరు ఇఖ్కడ చేపట్టిన పనులన్నీ వాళ్లేవే అన్నారని.. ఆయన అన్నట్టుగా పెట్రోల్ బంక్, గ్యాస్ గోడౌన్ సహా ప్రాజెక్టుల్లో కమీషన్లు వాళ్లేనంటూ షర్మిల కౌంటర్ వేశారు. డీకే అరుణ కాదు.. కేడీ అరుణ అని పేర్కొన్న ఆమె.. ఆ మాట బీజేపీ నాయకులే అంటున్నారన్నారు. నువ్వేం చేస్తున్నావని తనని ప్రశ్నిస్తున్నారని.. తాను ప్రజల సమస్యల కోసం పాదయాత్ర చేస్తున్ననా షర్మిల బదులిచ్చారు. డీకే అరుణ ఎప్పుడూ ఈ నియోజకవర్గ ప్రజల పక్షాన నిలబడింది లేదని విమర్శించారు.
ఇక్కడ ఆసుపత్రిలో కాన్పు కోసం వెళ్తే సౌకర్యాలు లేవు, ఒక మహిళవైన నువ్వు ఆ సౌకర్యాలు కల్పించలేకపోయావంటూ షిర్మిల చెప్పారు. మీ గద్వాల్‌లో కనీసం ఆసుపత్రి కూడా లేదంటూ ఆగ్రహించారు. డీకే అరుణ కుటుంబానికి ఎస్సీ, ఎస్టీలంటే లెక్క లేదని.. అందుకే ఈ మధ్య ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైందని అన్నారు. తలంగాణలో 80 శాతం లిటరసీ ఉంటే.. ఈ గద్వాల్‌లో మాత్రం 40 శాతమే అక్షరాస్యత ఉందన్నారు. ముందు వీటిని పట్టించుకోండని, ఆ తర్వాత తమని విమర్శించండని అరుణను షర్మిల సూచించారు.
