YS Sharmila Again Makes Shocking Comments On CM KCR: ఇచ్చిన ప్రతి మాట అబద్ధమే, ప్రతి పథకం మోసమేనంటూ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పటాన్‌చెరు నియోజక వర్గంలో జిన్నారంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. అప్పట్లో వైఎస్సార్ చేసిన ఐదేళ్ల పాలన ఓ అద్భుతమని తెలిపారు. ఐదేళ్లలో ఆయన ఒక్క రూపాయి పన్ను కూడా పెంచలేదని, అన్ని సంక్షేమ పథకాలను బ్రహ్మాండంగా అమలు చేసి చూపించారన్నారు. ముఖ్యమంత్రి & పరిపాలన ఉండాలంటే.. అది వైఎస్సార్‌లా ఉండాలన్నారు. మరి, కేసీఆర్ అలా ఉన్నాడా? ఎనిమిదేళ్ల పాలనలో ఏమైనా ఇచ్చాడా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
తన జన్మలో ఇచ్చిన ఒక్క మాటని కూడా కేసీఆర్ నిలబెట్టుకోలేదని షర్మిల ఎద్దేవా చేశారు. పటాన్‌చెరు నియోజక వర్గానికి ఆయన చేసిందేమీ లేదన్నారు. వైఎస్సార్ హయాంలో ఔటర్ రింగ్‌రోడ్ కడితే.. ఈ నియోజక వర్గం రూపు రేఖలు మారిపోయాయన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌కి సంబంధం లేదన్నట్లుగా ఉండే ఈ ప్రాంతం.. ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందిందని, లక్షల్లో ఉన్న భూముల విలువ కోట్లకు పడగలెత్తాయని అన్నారు. వైఎస్సార్ తీసుకొచ్చిన కొత్త పాలసీ పుణ్యమా అని.. వెళ్లిపోతున్న పరిశ్రమలు ఇక్కడే ఉండిపోవడంతో పాటు సరికొత్త పరిశ్రమలు వచ్చాయని, దాంతో వేలాదిమందికి ఉపాధి దొరికిందని అన్నారు. తెల్లాపూర్‌లో ఐటీ పార్క్‌తో పాటు 100 పడకల ఆసుపత్రిని తీసుకొచ్చారని గుర్తు చేశారు. మరి, కేసీఆర్ ఈ నియోజక వర్గానికి ఏం తెచ్చారు? అని నిలదీశారు. మెట్రో రైలు తీసుకువస్తానని కేటీఆర్ అన్నాడు.. కానీ ఇవ్వలేదు. కాలుష్య జలాలు శుద్ది చెసే ప్లాంట్ అన్నారు.. అది కూడా తీసుకురాలేదన్నారు.
చివరికి.. ఎమ్మెల్యేలు సైతం పటాన్‌చెరు నియోజక వర్గాన్ని పట్టించుకోలేదన్నారు. మూడు కబ్జాలు, ఆరు కమీషన్లలతో చక్కగా సంపాదించుకుంటున్నారే తప్ప.. ప్రజల గురించి ఆలోచించడం లేదన్నారు. ఇది దోపిడీ రాజ్యమని.. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్లు, సంపాదనే ఇక్కడి ఎమ్మెల్యేల ధ్యేయమని ఆరోపించారు. దళితులకు దళిత బందు అని చెప్పి నిండా ముంచేశారన్నారు. దళితులు రాష్ట్రంలో 20 వేల మంది ఉన్నారని.. మరి వారికి ఈ పథకం ఇచ్చారా? అని నిలదీశారు. దళిత బందు లాగే గిరిజిన బందు, రేపు బీసీ బందు, ఎల్లుండి ఆకాశంలో చందమామ కూడా తెస్తానని కేసీఆర్ మాయమాటలు చెప్తారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తేనే ఈ కొత్త హామీలని.. ఓట్లు వేయించుకున్నా తిరిగి వెళ్లిపోవడమే వాళ్లకి తెలుసని వ్యాఖ్యానించారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తానని చెప్తున్న కేసీఆర్.. మరి ఇన్నేళ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్లు ప్రక్రియ వస్తుందని.. దాన్ని ఆపడానికే గిరిజన జీవో అని, ఇది ఒక ఎత్తుగడ అని చెప్పారు.
తెలంగాణ లో ఏ వర్గాన్ని ఆదుకోవడం చేతకాదన్నారు. బతుకమ్మ చీరలు అన్నగా, తండ్రిగా కేసీఆర్ ఇస్తున్న డబ్బులని ప్రచారం చేసుకుంటున్నారని.. ఆ డబ్బులు మీ ఇంట్లోవా? ఢిల్లీ లిక్కర్ స్కాంకి చెందినవా? ఫీనిక్స్ కంపెనీ నుంచి తెచ్చారా? కాళేశ్వరంలో దోచుకున్న డబ్బులతో ఇస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మోరిగాయన్నట్టు.. కేటీఆర్‌కు బాసర వెళ్లడానికి ఇప్పుడు తీరిక కుదిరిందా? అక్కడి సమస్యలు ఇప్పుడు కనిపించాయా? అని నిలదీశారు.