ఆడవారిని రక్షించడానికి ప్రభుత్వం ఎన్నో కఠిన చర్యలు తీసుకొంటుంది. అందులో భాగంగానే షీ టీమ్స్, దిశా యాప్స్.. ఆడవారిని హింసిస్తే కఠిన చర్యలు తప్పవని ప్తభుత్వం నిక్కచ్చిగా తెలిపింది. మహిళలు తమకు ఎటువంటి సమస్య ఎదురైనా షీ టీమ్స్ కి కాల్ చేసి చెప్పవచ్చు. ఐతే గత కొన్ని రోజులుగా షీ టీమ్ కి మహిళలు తమను వేధిస్తున్నారని వారి భర్తలు ఫిర్యాదు చేయడం చర్చానీయాంశంగా మారింది. తాజాగా ఒక భర్త తన భార్య విడాకులు ఇవ్వమంటూ ఏడాది కాలంగా వేధిస్తోందని సైబరాబాద్ భరోసా కేంద్రాన్ని ఆశ్రయించాడు.
వివరాలలోకి వెళితే .. సైబరాబాద్ పరిధిలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి గత కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అతను మద్యానికి బానిసై భార్యను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో విసిగిపోయిన భార్య, అతడితో ఉండలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. కొన్ని నెలలకు తన తప్పు తెలుసుకున్న భర్త, భార్యను కాపురానికి రమ్మని బతిమిలాడాడు. అందుకే ఆమె తనపై నమ్మకం లేదని, తనకు విడాకులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. తాను ఇప్పుడు పూర్తిగా మారిపోయానని ఎంత చెప్పినా వినకుండా భార్య విడాకులు కోరడంతో భర్త సైబరాబాద్ భరోసా కేంద్రంలో ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు భార్యాభర్తలిద్దరిని కౌన్సిలింగ్ కి పిలిచి మాట్లాడగా.. భర్తపై తనకు నమ్మకం లేదని, కొద్దీ రోజుల తర్వాత మళ్లీ మొదటికే వస్తాడని, ఇకపై తనను కౌన్సిలింగ్ కు కూడా పిలవద్దని పోలీసులకు తెగేసి చెప్పింది. పెద్దల సమక్షంలో ఏదో ఒక విషయం తేల్చుకుంటానని పోలీసులకు వెల్లడించింది. ఇలా దాదాపు చాలా వరకు భర్తలు ఆ భరోసా కేంద్రానికి ఫోన్ చేసి ఫిర్యాదులు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ నెలలో సైబరాబాద్ భరోసా కేంద్రానికి 73 ఫిర్యాదులు అందాయని, ఇందులో 72 గృహ హింస, ఒకటి పోక్సో కేసుగా నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.