కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా కోవిడ్ టీకాలను వేగంగా అమలుచేస్తున్నారు. టీకా వేయించుకుంటే కరోనా బారినుంచి బయటపడే అవకాశం ఉంటుందని ప్రభుత్వాలు, ఇతర సంస్థలు విస్తృతంగా ప్రచారం చేయడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూలో నిలబడి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. అయితే, వ్యాక్సినేషన్ విషయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. కోవిడ్ టీకా వేయించుకోవడానికి వెళ్లిన ఓ మహిళకు, ర్యాబిస్ వ్యాక్సిన్ వేశారు. ఈ సంఘటన నల్గొండ జిల్లాలోని బొల్లేపల్లిలో జరిగింది.
Read: అజిత్ అభిమానులా మజాకా… ట్రెండ్ సెట్ చేసేస్తున్నారుగా…!
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పారిశుద్ద్య కార్మికురాలిగా పనిచేస్తున్న ప్రమీల అనే మహిళ, పాఠశాల ప్రధానోపాద్యాయుడి నుంచి లెటర్ తీసుకొని వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్లింది. అయితే, అక్కడ రెండు చోట్ల రెండు రకాల వ్యాక్సిన్లు ఇస్తున్నారు. ఒక చోట కేంద్ర ఆయుష్ మిషన్‌లో భాగంగా కరోనా టీకాలు వేస్తుంటే, మరోచోట సాధారణ టీకాలు వేస్తున్నారు. అయితే, మహిళ సాధారణ టీకాల క్యూలైన్లో నిలబడింది. దీంతో ఆమెకు టీకా ఇచ్చారు. కుక్క కరిచిన వారికి ఇచ్చే వ్యాక్సిన్ ఇవ్వడంతో మహిళ వాపోయింది. లెటర్ చూడకుండా వ్యాక్సిన్ ఎలా ఇస్తారని ప్రశ్నించింది మహిళ. మహిళకు ర్యాబిస్ వ్యాక్సిన్ ఇవ్వలేదని, టీటీ ఇంజెక్షన్ మాత్రమే ఇచ్చామని, కరోనా వ్యాక్సిన్ క్యూలో కాకుండా మహిళ సాధారణ టీకాల క్యూలైన్లో నిలబడిందని నర్సులు చెబుతున్నారు.