మైనర్ లకు పబ్బుల్లో అనుమతి ఎవరు ఇచ్చారు..? అని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మండిపడ్డారు. అనంతరం మాట్లాడుతూ.. మైనర్ లకు పబ్బుల్లో అనుమతి పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అన్నీ దేశాల కల్చర్ తేవడం కాదు.. అమ్మాయిలకు రక్షణ ఇవ్వండని విమర్శించారు. పబ్బులు నిబంధన పాటించేలా చూడాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ ట్వీట్ లు చేసుడు కాదు.. యాక్షన్ తీసుకోవాలని ఎద్దేవ చేశారు. మైనర్ అమ్మాయి పై జరిగిన అత్యాచారంపై హైకోర్టులో.. లేదంటే సుప్రీం కోర్టు సుమోటో కేసు నమోదు చేయాలని ఆమె కోరారు.
సుప్రీం కోర్టు సీజే స్పందించాలని, సుమోటో గా స్వీకరించాలని రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. హోంమంత్రి మనవడే ఈ కేసులో ఉన్నారని ఆరోపించారు. ఇన్నోవా వాహనం ఎవరిది అనేది తేలాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వంకి చిత్తశుద్ది ఉంటే.. కేసు నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని అనుకుంటే.. సీబీఐ విచారణకి ఆదేశించాలని రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి మీదనే ఆరోపణలు వస్తే.. సీబీఐ విచారణ ఎందుకు చేయరని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆమె కోరారు. న్యాయపరంగా అన్ని తలుపులు తడతామని ఆమె హెచ్చరించారు.
