Site icon NTV Telugu

Telangana: తెలంగాణలో ఆప్‌ ఎంట్రీ ఎవరికి లాభం?

Kejriwal

Kejriwal

ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఈసారి జాతీయ పార్టీ జెండా ఎగురుతుందా? కానీ టీఆర్‌ఎస్‌ పార్టీని చిత్తు చేసే సత్తా ఎవరికి ఉంది? గులాబీ దళాన్ని మట్టికరిపించే దమ్ము తమకే ఉందని చెప్పుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు కాంపిటీషన్‌గా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంట్రీ ఇస్తోంది. ఇటీవల పంజాబ్‌లో పాగా వేసిన ఆమ్‌ ఆద్మీ ఇప్పుడు తెలంగాణపై గట్టిగానే ఫోకస్‌ పెట్టింది.

ప్రస్తుతం తెలంగాణ రాజకీయం సంక్లిష్టంగా ఉంది. అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరు అంటే.. చెప్పే పరిస్థితి లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య పోరు తీవ్రస్థాయిలో ఉండటమే దానికి కారణం. రాష్ట్ర వ్యాప్తంగా ఉనికిని కలిగివున్న కాంగ్రెస్‌ పార్టీ టీఆర్‌ఎస్‌కు సహజ ప్రత్యర్ధి అనటంలో సందేహం లేదు. కానీ ఇటీవల కాలంలో బీజేపీ అనూహ్యంగా బలపడుతోంది. అయితే అధికారం సాధించే స్థాయిలో ఆ ఎదుగుదల ఉన్నదా అనేది ప్రశ్నార్థకం. బీజేపీ బలపడటం టీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయకపోవచ్చు. కానీ పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ అవకాశాలను మాత్రం అది తీవ్రంగా దెబ్బతీస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య చీలితే అంతిమంగా లభించేది అధికార పార్టీకే.

మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి కొత్త ప్రత్యర్థి తయారవుతున్నాడు. ఇప్పటికే బీజేపీ దూకుడు రాజకీయాలతో అటు అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇప్పుడు ఆమ్‌ ఆద్మీ పార్టీ పాగా వేసే ప్రయత్నంలో ఉంది. పంజాబ్‌ గెలుపు ఉత్సాహంతో ఉన్న ఆప్‌ తనదైన శైలిలో రాష్ట్రంలో తన పునాది ఏర్పాటు చేసుకుంటోంది. నేతల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. త్వరలో కేజ్రీవాల్ తెలంగాణ పర్యటన తర్వాత పలువురు రిటైర్డ్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఆప్‌లో చేరతారని తెలుస్తోంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో తమకు తెలంగాణలో ఉజ్వలమైన అవకాశాలు ఉంటాయని ఆప్‌ బలంగా నమ్ముతోంది.

టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా రాష్ట్రంలో పట్టు సాధించాలంటే ఆప్‌కు భారీ స్థాయి కార్యాచరణ అవసరం. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరింపజేసే వ్యూహాత్మక కార్యాచరణ, ఆర్థికంగా బలమైన నేతల కోసం ఆప్‌ కేంద్ర నాయకత్వం అన్వేషణ సాగిస్తోందని తెలుస్తోంది. ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఓ మాజీ ఐఏఎస్‌ను పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. అలాగే సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారి కుటుంబీకులను కూడా పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వినికిడి. అలాగే కాంగ్రెస్‌–బీజేపీ కాకుండా మరో ప్రత్యామ్నాయ పార్టీలో చేరాలనుకుంటునన ఓ మాజీ ఎంపీతో ఆప్‌ టీం చర్చలు జరిపినట్టు తెలిసింది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్మాణం, విస్తరణపై ప్రస్తుతం ఆప్‌ నాయకత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

ఆప్ ఎన్నికల నినాదం అవినీతి రహిత రాజకీయం, స్వచ్చమైన పాలన. ఆప్‌ దక్షిణాది రాష్ట్రాల ఇంఛార్జీ సోమనాథ్ భారతి తరచూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ స్వయంగా అవినీతికి పాల్పడుతున్నారని, రాష్ట్ర ఖజానా నుంచి వేల కోట్లు వృధా చేశారంటూ భారతి ఆరోపణలు తీవ్రం చేస్తున్నారు. ఆయన ఇప్పటికే వారంలో రెండురోజులు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మాజీ ప్రభుత్వ ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నేతలతో తరుచూ సమావేశమవుతూ పార్టీ విస్తరణకు ప్రయత్నిస్తున్నారు.

కేసీఆర్‌ పాలనలో అవినీతిమయమైన తెలంగాణలో మెరుగైన ప్రమాణాలు కలిగిన విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కోసం కృషి చేస్తామని ఆప్‌ అంటోంది. దీనిని బట్టి తెలంగాణలో పార్టీ విస్తరణపై ఆ పార్టీ ఎంత సీరియస్‌గా ఉన్నదో తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్‌ నేషనల్‌ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఈ నెల 14న హైదరాబాద్‌కు వస్తున్నారు. తమ పార్టీ అంబేడ్కర్‌ అడుగుజాడల్లో నడుస్తోందని పంజాబ్‌ ఎన్నికల్లో ఆప్‌ పదే పదే చెప్పిన విషయం తెలిసిందే. కనుక, అంబేడ్కర్‌ జయంతి సందర్భంగానగరంలో పాదయాత్రకు ఆప్‌ శ్రీకారం చుట్టింది. చార్మినార్‌ నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం అవుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ప్రస్థానం మొదలైంది. అయితే ఎన్నికల బరిలో దిగింది మాత్రం 2018లో. రాష్ట్రంలోని 119 స్థానాలకు గానూ ఆప్‌ 41 స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఏ ఒక్క అభ్యర్థికీ డిపాజిట్‌ దక్కలేదు. అందరికి 13,500 ఓట్లు వచ్చాయి. ఇదీ ఇప్పటి వరకు తెలంగాణలో ఆప్‌ ఎలక్షన్‌ ట్రాక్‌ రికార్డు. ఈ స్థితిలో ఉన్న పార్టీ ఒక్క ఏడాదిలో అధికార పార్టీకి టక్కర్‌ ఇస్తుందంటే నమ్మటం కష్టమే.

మరోవైపు తెలంగాణలో గత రికార్డును ఆప్‌ తేలికగా తీసుకుంటోంది. పార్టీ పరిస్థితి ఇప్పుడు అప్పటిలా లేదు. ఆప్‌ హయాంలో ఢిల్లీలో జరిగిన అభివృద్ది, పంజాబ్‌ గెలుపును చూపిస్తూ జనంలోకి దూసుకు వెళ్లేలా వ్యూహాలు సిద్దం చేస్తోంది. అయినా ఆమ్‌ ఆద్మీ పార్టీ వచ్చే ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ని ఓడిస్తుందనే భ్రమలు ఎవరికీ లేవు. కానీ, కేజ్రీవాల్‌ తన పదునైన విమర్శనాస్త్రాలతో కేసీఆర్‌ని ఇబ్బందిపెట్టడం తథ్యమంటున్నారు విశ్లేషకులు. సామాన్యుడి పార్టీగా ప్రజలలో గుర్తింపు పొందిన ఆప్‌ ఎంట్రీ ఎవరికి లబ్ధి చేకూరుస్తుందో ఇప్పుడే చెప్పలేం. కానీ చతుర్ముఖ పోటీతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతుందనటంలో మాత్రం సందేహం లేదు.

https://ntvtelugu.com/congress-party-will-not-survive-if-it-does-not-change/

Exit mobile version