Water Level Rising In Bhadrachalam Godavari: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మరోసారి విస్తారంగా కురుస్తుండటం వల్ల.. భద్రాచలం గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఇప్పటికే గోదావరి వరద 43 అడుగుల చేరడంతో.. జిల్లా కలెక్టర్ అనుదీప్ తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరికి ఎగువనున్న ప్రాణహిత, ఇంద్రావతి, నదుల నుండి వరద వస్తున్న నేపథ్యంలో.. మంగళవారం రాత్రికి గోదావరి వరద 55 అడుగులకు పెరిగే అవకాశం ఉందన్నారు. కాబట్టి.. ముంపు మండలాల ప్రజలు, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని, ప్రజలు వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. పశువులను బయటకు మేతకు వడలకుండా, ఇంటి పట్టునే జాగ్రత్తగా ఉంచాలన్నారు. అలాగే.. జాలర్లు చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పారు. ప్రస్తుతం గోదావరిలో 9.55 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొసాగుతోంది.
కాగా.. గత నెలలో భద్రాచలం వద్ద గోదావరికి రికార్డు స్థాయిలో వరద పోటెత్తిన విషయం విదితమే! 70 అడుగుల మేర గోదావరి ప్రవహించడంతో.. భద్రాచలంలోని కాలనీలు నీటమునిగాయి. ముంపు గ్రామాలైతే వారం పాటు నీటిలోనే ఉండిపోయాయి. ఇప్పుడు మరోసారి గోదావరి నీటిమట్టం పెరుగుతుండడంతో ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు.. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఆల్రెడీ మంగళవారం ఉదయం హైదరాబాద్ నగరంలో వాన దంచికొట్టింది. శేరిలింగంపల్లి, షేక్‌పేట్, ఆసిఫ్‌నగర్ ఏరియాల్లో అత్యధికంగా 4.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే.. నిజామాబాద్‌లోని డిచ్‌పల్లిలో అత్యధికంగా 27 మి.మీ. నమోదైనట్లు తేలింది.