Site icon NTV Telugu

Warangal Declaration: వరంగల్ డిక్లరేషన్‌ తో కాంగ్రెస్ రణనినాదం

Rahul

Rahul

వరంగల్ లో రైతు సంఘర్షణ సభ పేరుతో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరుకి రణనినాదం చేసింది తెలంగాణ కాంగ్రెస్. 2023లో రాబోయే ఎన్నికలకు నాందిగా సభలో వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు రాహుల్ గాంధీ. బ్రిటీషు బానిస సంకెళ్ల విముక్తి నుండి స్వాతంత్ర్య భారత నిర్మాణానికి పునాది రాయి వేసే వరకు… భిన్నత్వంలో ఏకత్వంగా జాతిని ఐక్యం చేయడం నుండి నవ ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంకేతిక భారతావని నిర్మాణం వరకు… ఈ దేశ గమనంలో, గమ్యంలో కాంగ్రెస్ ఉంది. హిమాచలం నుండి కన్యాకుమారి వరకు… గాంధీ జన్మస్థలం నుండి ఠాగూర్ కర్మస్థలం వరకు ఎగిరే ఏకైక జెండా కాంగ్రెస్. భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, భాషలు, భావాలు మేళవించిన భారతీయతకు శ్రీరామరక్ష కాంగ్రెస్ మాత్రమే. ఇది చరిత్ర చెప్పిన సత్యం.
ప్రజల ఆకాంక్షలే ముఖ్యం తప్ప రాజకీయ కాంక్ష కాదన్నది కాంగ్రెస్ సిద్ధాంతం. తెలంగాణ స్వరాష్ట్ర కలను శ్రీమతి సోనియాగాంధీ నిజం చేయడమే దీనికి నిదర్శనం. రాజకీయాల్లో విశ్వసనీయత, జవాబుదారితనం ముఖ్యం. ఆ దిశగా శ్రీ జవహర్ లాల్ నెహ్రూ, శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ వేసిన బాటలో శ్రీమతి సోనియాగాంధీ పయనిస్తూ… నేటి తరానికి ఏకైక ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారు.

సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్
ఏకకాలంలో రూ.73 వేల కోట్ల రైతురుణమాఫీ, గిట్టుబాటు ధర, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, విత్తన, ఎరువుల సబ్సిడీ, సబ్సిడీ పై వ్యవసాయ పరికరాలు, పంటల బీమా వంటి రైతు సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసింది కాంగ్రెస్. ఉపాధి హామీ లాంటి చట్టబద్ధ పథకాలకు పురుడుపోసింది కాంగ్రెస్. విద్యాహక్కు, సమాచార హక్కు లాంటి చట్టాలు చేసి సామాన్యుడికి అస్త్రాలు ఇచ్చింది కాంగ్రెస్. పేదవాడికి కార్పొరేట్ వైద్యం, పేద విద్యార్థుల చదువులకు ఫీజు రీ ఇంబర్స్ మెంట్ ఇచ్చింది కాంగ్రెస్.

ఇదీ కాంగ్రెస్ విశ్వసనీయత
ఇందిరమ్మ పథకం ద్వారా 40 లక్షల ఇళ్లు, రాజీవ్ స్వగృహ ద్వారా 43,759 ఇళ్లు, రాజీవ్ గృహకల్ప ద్వారా 35,116 ఇళ్లు, జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద పట్టణ ప్రాంతాల్లో మరో 27.89 లక్షల ఇళ్లను పేద, మధ్య తరగతికి కట్టించి ఇచ్చిన ఘతన కాంగ్రెస్ పార్టీది. ఉమ్మడి రాష్ట్రంలో 35 లక్షల ఎకరాలకు పైగా దళితులకు ఆసైన్డ్ భూములు పంచగా… అందులో సుమారు 14 లక్షల ఎకరాలు ఒక్క తెలగాణ ప్రాంతంలోనే ఇచ్చాం. 2006 లో యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఆర్వోఎఫ్ఆర్ చట్టం కింద తెలంగాణలో 4.44 లక్షల ఎకరాల పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పించాం. ఇదీ కాంగ్రెస్ విశ్వసనీయత.

టీఆర్ఎస్ పాలనలో ఉరికొయ్యకు రైతు…

ఉద్యమ లక్ష్యాలు, అమరవీరుల ఆకాంక్షలు నెరవేరాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే… కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం గడచిన ఎనిమిదేళ్లలో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసింది. రాష్ట్రంలో నిత్యం రైతుల చావుకేకలు వినిపిస్తున్నాయి. 20 నుంచి 40 ఏళ్ల యువ రైతులు ఉరితాళ్లకు వేలాడుతున్నారు. పంట నష్టాలు, మోయలేని అప్పులతో పురుగుల మందు తాగి చస్తున్నారు. నకిలీ విత్తనాలు, పురుగు మందులతో పంట నష్టం…తీరా పంట చేతికి వస్తే గిట్టుబాటు ధర లభించక నష్టం… ఇలా రైతు నష్టంలో పుట్టి… అప్పుల మధ్య పెరిగి అదే నష్టం – అదే అప్పు కారణంగా ఉసురు తీసుకుంటున్నాడు.

కాంగ్రెస్ గురుతర బాధ్యత
ఈ నేపథ్యంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై గురుతర బాధ్యత ఉంది. ఇక్కడ రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన అనివార్యత ఉంది. తెలంగాణలో సాగుకు పూర్వవైభవం తేవడానికి నడుం కట్టాల్సిన అవసరం ఉంది. రైతుల హక్కుల కోసం నాటి సాయుధ పోరాట స్ఫూర్తిగా పోరాడాల్సిన సమయం ఇది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆదుకునే దిశగా ఆలోచన చేయాల్సిన సందర్బం ఇది.

ఆ దిశగా ప్రకటిస్తున్నదే ఈ వరంగల్ డిక్లరేషన్.
1.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏక కాలంలో రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తాం.
2.”ఇందిరమ్మ రైతు భరోసా” పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు, ఏడాదికి రూ.15 వేల పెట్టుబడి సాయం చేస్తాం. ఉపాధి హామీ లో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది రూ.12 వేలు ఇస్తాం.
3.రైతులు పండించిన అన్ని పంటలకు (ఉదాహరణకు వరి, పత్తి, మిర్చీ, చెరకు, పసుపు, మామిడి, బత్తాయి తదితర పంటలు) మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి మన కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.
4.తెలంగాణలో మూతబడిన చక్కెర కర్మాగారాలను తెరిపించి, పసుపు బోర్డు ఏర్పాటు చేసి చెరకు, పసుపు రైతులకు పూర్వవైభవం తెస్తాం.
5.రైతులపై భారం లేని పంటల బీమా పథకాన్ని తెచ్చి… ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగితే త్వరిత గతిన నష్టం అంచనా వేయించి… పరిహారం అందిస్తాం. రైతు కూలీలు, భూమిలేని రైతులకు సైతం రైతు బీమా పథకాన్ని వర్తింపజేస్తాం. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం.
6.పోడు రైతులకు యాజమాన్య హక్కు పట్టాలు ఇస్తాం. అసైన్డ్ భూముల లబ్ధిదారులకు భూమిపై యాజమాన్య హక్కులు, క్రయ – విక్రయ హక్కులు కల్పిస్తాం. ధరణి పోర్టల్ రద్దు చేసి, సరళతరమైన సరికొత్త రెవెన్యూ వ్యవస్థను తీసుకు వస్తాం.
7.నకిలీ విత్తనాలు, పురుగు మందుల నియంత్రణకై కఠిన చట్టాలు తెచ్చి, బాధ్యులైన సంస్థలు, వ్యక్తుల ఆస్తులు జప్తు చేసి రైతులకు పరిహారం ఇప్పిస్తాం. పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తాం.
8.నిర్దుష్ట సమయ ప్రణాళికతో,అవినీతి రహితంగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చేస్తాం.
9.రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టబద్ధమైన “రైతు కమిషన్” ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో భూముల స్వభావం, వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు పంటల ప్రణాళికను రూపొందించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతాం.

రైతును రాజును చేయడమే మా లక్ష్యం… రాహుల్ గాంధీతోనే అది సాధ్యం అంటూ డిక్లరేషన్ ముగించారు టీపీసీసీ సారథి రేవంత్ రెడ్డి.

KTR vs Revanth Reddy: రాహుల్ పర్యటనపై కేటీఆర్ సెటైర్, రేవంత్ కౌంటర్

Exit mobile version