Anganwadi Recruitment : వికారాబాద్‌ జిల్లాలో అంగన్‌వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!

  • వికారాబాద్ జిల్లాలో 264 అంగన్‌వాడీ పోస్టులు
  • 102 టీచర్లు.. 162 హెల్పర్ల నియామకం
  • అక్టోబర్ 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
  • నవంబర్ 1లోగా పత్రాలు సమర్పించాలి
Anganwadi

Anganwadi

వికారాబాద్ జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేసేందుకు జిల్లా సంక్షేమ శాఖాధికారి అధికారికంగా నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అయితే.. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు , వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 264 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 102 అంగన్‌వాడీ టీచర్ పోస్టులతో పాటు 162 అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం

ఈ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 10వ తేదీన ప్రారంభం కాగా, అక్టోబర్ 24వ తేదీ సాయంత్రం 5:00 గంట వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు మహిళా అభివృద్ధి , శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్‌సైట్ అయిన wdcw.tg.nic.in ద్వారా తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలి. అయితే, కేవలం ఆన్‌లైన్ దరఖాస్తుతో సరిపెట్టకుండా, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రతులను , సంబంధిత ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలను అటెస్టేషన్ చేయించి అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1వ తేదీలోపు సంబంధిత ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్ట్ కార్యాలయంలో విధిగా సమర్పించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు

వికారాబాద్ జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల పరిధిలో ఈ ఖాళీలను పంపిణీ చేశారు. అత్యధికంగా పరిగి ప్రాజెక్టు పరిధిలో మొత్తం 105 ఖాళీలు ఉండగా, అందులో 27 టీచర్ పోస్టులు, 78 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. తండూరు ప్రాజెక్టులో 51 ఖాళీలు (23 టీచర్లు, 28 హెల్పర్లు), కొడంగల్ ప్రాజెక్టులో 44 ఖాళీలు (13 టీచర్లు, 31 హెల్పర్లు), మార్పల్లి ప్రాజెక్టులో 35 ఖాళీలు (21 టీచర్లు, 14 హెల్పర్లు) , వికారాబాద్ ప్రాజెక్టు పరిధిలో 29 ఖాళీలు (18 టీచర్లు, 11 హెల్పర్లు) చొప్పున భర్తీ చేయనున్నారు. విద్యార్హతలు, వయోపరిమితి, స్థానికత తదితర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి మార్గదర్శకాలను పరిశీలించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.