Vijayashanti Comments On BJP State Leadership: బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై మాజీ ఎంపీ, ఆ పార్టీ లీడర్ విజయశాంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నోరు నొక్కేస్తున్నారంటూ ఆమె నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, అసలేం జరుగుతోందో కూడా తనకు అర్థం కావడం లేదని మండిపడ్డారు. సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా నేను మాట్లాడుదామనుకున్నా. కానీ, నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. లక్ష్మణ్ వచ్చారు, మాట్లాడారు, వెళ్లిపోయారు. అంతే.. నాకేం అర్థం కావడం లేదు. నా సేవల్ని ఎలా ఉపయోగించుకుంటారో బండి సంజయ్, లక్ష్మణ్‌కే తెలియాలి. పార్టీ బాధ్యతలు ఇచ్చినప్పుడే ఏమైనా చేయగలం, ఇవ్వకుండా చేయమంటే ఎలా సాధ్యమవుతుంది?’’ అంటూ విజయశాంతి తీవ్రంగా ఆగ్రహించారు.
తాను అసంతృప్తిగా ఉన్నానో, లేదో పార్టీ నేతల వద్దే స్పష్టత తీసుకోండంటూ విజయశాంతి అసహనం వ్యక్తం చేశారు. తన పాత్ర ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుందని, రాములమ్మ ఎల్లప్పుడూ రాములమ్మగానే ఉంటుందని అన్నారు. ఉద్యమకారిణిగా తాను ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించానని, పార్లమెంట్‌లో సైతం తాను కోట్లాడిన మనిషినని చెప్పారు. తన పాత్ర ఎప్పుడూ బాగానే ఉంటుందని చెప్పిన విజయశాంతి.. పాత్ర లేకుండా చేయాలనుకునే వాళ్లను పాతరేస్తే బెటర్‌గా ఉంటుందని సూచించారు. విజయశాంతి మాటల్ని బట్టి చూస్తుంటే, ఆమెకు పార్టీలో తగిన ప్రాముఖ్యత లభించడం లేదని స్పష్టమవుతోంది. తన అభిప్రాయాల్ని ఎవ్వరూ ఖాతరు చేయట్లేదని అర్థమవుతోంది. అందుకే, ఎన్నడూ లేని విధంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఈ స్థాయిలో విరుచుకుపడ్డారు. మరి, ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
