NTV Telugu Site icon

లాక్‌డౌన్ కేసీఆర్‌కు వరంలా మారింది.. అందుకే ఆస్పత్రుల పర్యటనలు !

సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనపై నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ సమయం చూసుకొని.. సీఎం కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. “కరోనా రోగులను పరామర్శించడానికి సీఎం కేసీఆర్ గారు వరంగల్ ఎంజీఎంను సందర్శిస్తే… అక్కడి ప్రజలు మాత్రం జనవరి 2015 నాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళారు. నాడు ఈ నగరంలోని పలు మురికివాడల్లో పర్యటించిన సీఎం గారు వారికి కొత్త ఇళ్ళు కట్టిస్తానని, వాటిలో దావత్ చేసుకోవడానికి 5 నెలల్లో మళ్లీ వస్తానని ఆశలు కల్పించారు. వరంగల్‌ని టెక్స్‌టైల్ హబ్ చేస్తానన్నారు. హైదరాబాదు నుంచి ఐటీ కంపెనీలు వరంగల్ వచ్చేలా చేస్తానన్నారు. ఇవిగాక చిన్నా చితకా హామీలు ఇంకెన్నో ఆయన నోట్లోంచి ముత్యాల్లాగా రాలాయి. చివరికి గతేడాది వరదల్లో ఈ హామీలన్నీ కొట్టుకుపోయాయి. మళ్ళీ అక్కడకు వెళితే ఎక్కడ జవాబు చెప్పుకోవాల్సి వస్తుందోనని భయపడుతూ వచ్చిన సీఎం గారికి తాను విధించిన ఈ కరోనా లాక్‌డౌన్ పెద్ద వరంలా మారింది. ప్రజలందరూ ఇళ్ళలోనే ఖైదీల్లా కాలం గడుపుతున్న సమయం చూసుకుని ఎంజిఎంని చుట్టేసి వచ్చారు. ప్రజల కంటబడితే ఎక్కడ నిలదీస్తారోనన్న ఆందోళనతో బిక్కు బిక్కుమంటూ బతికే పరిస్థితికి సీఎం దిగజారిపోయారు. ఏదిఏమైనా సంవత్సరాల పాటు ప్రజలకు, MLA లకు, నెలలు పాటు మంత్రులకు అనుమతులు ఉండని ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి గారు జిల్లాలలో ప్రజాగ్రహనికి గురి కాకుండా ప్రయత్నించటానికి, ఈ లాక్ డౌన్ గొప్ప అవకాశమని భావిస్తున్నట్లు కనిపిస్తుంది.” అంటూ ఫైర్ అయ్యారు విజయశాంతి.