Uttam Kumar Reddy : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS) విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన తీరుపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు బీఆర్ఎస్ హయాంలో తీరని అన్యాయం జరిగిందని, ఇప్పుడు తమ ప్రభుత్వంపై బురద జల్లడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.
ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్ఎస్ ప్రభుత్వ చేతకానితనాన్ని మంత్రి ఎండగట్టారు. 2015లో ఈ ప్రాజెక్టు కోసం జీవో జారీ చేసినప్పటికీ, కేంద్ర జల సంఘానికి (CWC) డీపీఆర్ (Detailed Project Report) సమర్పించడానికి నాటి ప్రభుత్వానికి ఏడేళ్ల మూడు నెలల సమయం పట్టిందని ఎద్దేవా చేశారు. ఆశ్చర్యకరంగా, డీపీఆర్ ఆమోదం పొందకముందే రూ. 20,641 కోట్లు ఖర్చు చేశారని, ఇది వారి పాలనలోని అస్తవ్యస్త విధానాలకు నిదర్శనమని విమర్శించారు.
“కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టి, దాని సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచిన కేసీఆర్.. పాలమూరు రంగారెడ్డి విషయంలో మాత్రం వివక్ష చూపారు” అని ఉత్తమ్ ఆరోపించారు. పాలమూరు సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి తగ్గించారని దుయ్యబట్టారు. అంతేకాకుండా, ప్రాజెక్టు పనులను ఉద్దేశపూర్వకంగానే నెమ్మదిగా (Slow down) చేయాలని నాటి రాజకీయ పెద్దలు అధికారులకు ఆదేశాలు ఇచ్చారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 90 శాతం పనులు పూర్తయ్యాయని ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. “అసలు ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 70,000 కోట్లకు పైగా ఉంటే, బీఆర్ఎస్ హయాంలో జరిగింది కేవలం రూ. 27,000 కోట్ల పనులు మాత్రమే. ఇది 90 శాతం ఎలా అవుతుంది?” అని ఆయన ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా వంటి వాటిని కూడా తొమ్మిదిన్నరేళ్లలో పూర్తి చేయలేకపోయారని విమర్శించారు.
బీఆర్ఎస్ ఎన్ని ఆటంకాలు సృష్టించినా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తమ ప్రభుత్వం 90 టీఎంసీల సామర్థ్యంతోనే పూర్తి చేసి తీరుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తాము అధికారంలోకి వచ్చాక 11 పంపుల ఇన్‌స్టాలేషన్ పూర్తి చేశామని, ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని వెల్లడించారు.
