సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రూ.26 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖను ప్రక్షాళన చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే ఆరోగ్య శ్రీ పతకాన్ని రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచామని ఆయన తెలిపారు. రెడ్ల కుంట, శాంతి నగర్ వద్ద పాలేరు వాగు పై రూ.52.94 కోట్ల వ్యయంతో లిఫ్ట్ పనులు ప్రారంభిస్తున్నామని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కోదాడ పరిధిలోని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను పక్కన పెట్టిందని, కోదాడ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
అనంతరం తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. కోదాడ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుందని, కబ్జాలు, దోపిడీ, అరాచకాలు లేని ప్రభుత్వం తయారవుతుందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రజలు అన్యాయానికి గురయ్యారని ఆయన మండిపడ్డారు. ఏ పార్టీలో ఉన్న ప్రజలు నన్ను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో చిత్త శుద్దిగా పనిచేస్తామని ఆయన వెల్లడించారు. ఆ తరువాత దామోదర రాజనరసింహ మాట్లాడుతూ.. నిబ్బతతో ఉన్న నాయకుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఆయన అన్నారు. పేదవాడికి ఆరోగ్యాన్ని అందించే బాధ్యత ప్రభుత్వానిదని ఆయన తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కల్పించాలని, రూ. 26 కోట్లు వ్యయంతో కోదాడలో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. ఉచితంగా ఆరోగ్య శ్రీ ద్వారా పేదప్రజలు 1800 రోగాలుకు వైద్యం అందిస్తామన్నారు.
