హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీర్చాల్సిన ఎలివేటెడ్ కారిడార్.. ఏళ్ల తరబడి ఎదురుచూపులకే పరిమితమవుతోంది.. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు 2018లో మొదలైనా.. ఇప్పటికీ పూర్తి కాలేదు.. దసరా నాటికి అందుబాటులోకి తీసుకొస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరలేదు.. ఇప్పుడు మరో ఏడాది గడువు పెంచారు.. 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని చెబుతున్నారు.. అసలు ఈ ప్రాజెక్టు ఎందుకు ఆలస్యమవుతోంది..? నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలేంటి..? పెరుగుతున్న ఖర్చుతో పాటు.. పనులు పూర్తికాకపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి..? ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్‌పై ప్రత్యేక కథనం..
ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాలనే లక్ష్యం.. ప్రయాణాన్ని వేగవంతం చేయాలనే ఉద్దేశం.. కానీ ఏళ్లు గడుస్తున్నా లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు.. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు సుమారు 6.25 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పరిస్థితి ఇది.. 2018లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు.. నిర్ణీత గడువులో పూర్తి కావాల్సి ఉన్నా.. వరుస అవాంతరాలతో ముందుకు సాగుతోంది.. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు.. యాదాద్రి, భువనగిరి, వరంగల్ వైపు వెళ్లే ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ఈ కారిడార్ ప్రధాన ఉద్దేశం.. అయితే ప్రాజెక్టు ఆలస్యంతో ఆ ప్రయోజనాలు అందక.. ప్రజలు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ ప్రాజెక్టు ఆలస్యానికి అనేక కారణాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.. భూసేకరణ, పరిహారం చెల్లింపుల సమస్యలు ఒకవైపు.. కాంట్రాక్టర్ ఆర్థిక, న్యాయపరమైన ఇబ్బందులు మరోవైపు.. వీటికి తోడు కాంట్రాక్టర్ మార్పు, పనుల అమలులో జాప్యం ప్రాజెక్టు పురోగతిపై ప్రభావం చూపాయి.. ప్రారంభంలో సుమారు 425 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి.. తర్వాతి వ్యయం 600 కోట్లకు పైగా ఉన్నట్లు పలు నివేదికల్లో ప్రస్తావన వచ్చింది.. ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని ఆశించిన ప్రజలకు.. ప్రస్తుతం నిర్మాణ జాప్యమే ఇబ్బందిగా మారింది.. రద్దీ వేళల్లో వాహనాల బారులు.. ప్రయాణానికి అదనపు సమయం.. దుమ్ము, ట్రాఫిక్ మళ్లింపులతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు.. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, స్థానిక వ్యాపారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. గంటల తరబడి ట్రాఫిక్ లో ఇబ్బంది పడడమే కాకుండా.. అనేక ప్రమాదాలకు గురికావల్సిన పరిస్థితి ఎదురుకుంటూ.. పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి స్థానికుల్లో అసహనాన్ని పెంచుతోంది.
ఇక ఉప్పల్ నుండి నారపల్లి వరకు జరుగుతున్న ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ఏళ్లకు ఏళ్ళు పొడిగిస్తుడడం వామపక్ష పార్టీలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. రోజూ ఈ రోడ్డు పై ప్రజలు ఎదురుకుంటున్న ట్రాఫిక్ కష్టాలను ఇంకా ఎన్నాళ్లు ఉంటాయని వామపక్షాల నేతలు ప్రశ్నిస్తున్నారు. దాదాపు ఎనిమిది ఏళ్లుగా నిర్మాణ పనులతో ఈ రోడ్డు మొత్తం ఇరుకుగా మారి నిత్యం గంటల తరబడి ట్రాఫిక్ లోనే ఇరుక్కుని వాహనదారులు అవస్థలు పడుతున్నారని., కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నా ఫ్లై ఓవర్ పనులు మాత్రం ముందుకు సగడం లేదని నిరాశనలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రులు వెంటనే పూర్తి స్థాయిలో ద్రుష్టి పెట్టి త్వరగా ఈ ఎలివేటెడ్ కారిడార్ ను అందుబాటులోకి తేవాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు.. ప్రాజెక్టు పూర్తి గడువులపై ఇప్పుడు చర్చ మొదలైంది.. 2026 దసరా నాటికి పనులు పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు.. కానీ ఆ గడువు చేరుకునేలోపే మరోసారి లక్ష్యాన్ని మార్చాల్సి వచ్చింది.. సెప్టెంబర్ 10న శాసన మండలిలో ఈ ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు.. అంటే మరోసారి గడువు పొడిగించినట్లయింది.. ఇప్పటికే ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ప్రజలకు కొత్త గడువు ఎంతవరకు నమ్మకం కలిగిస్తుంది..? ఈసారి అయినా ప్రకటించిన తేదీకి పనులు పూర్తవుతాయా..? లేక మళ్లీ గడువు పెరుగుతుందా..? అన్న ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.

