NTV Telugu Site icon

Kishan Reddy: సికింద్రాబాద్‌లో నీలిట్ సెంటర్.. వర్చువల్ గా ప్రారంభించిన కిషన్ రెడ్డి

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: సికింద్రాబాద్‌లో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్ ను వర్చువల్ గా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ప్రారంభించారు. యువతకు, మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. నీలిట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) మన ప్రాంతంలో ప్రారంభం కానుండటం.. ఈ విద్యాసంవత్సరం నుంచే శిక్షణాతరగతులు ప్రారంభం కానుండటం.. చాలా సంతోషం అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగం నడుస్తోందన్నారు. ఇందులో.. భారతదేశం రానున్న రోజుల్లో పూర్తిగా తన పట్టును పెంచుకుంటోందన్నారు. మన తెలుగు యువత అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాల్లో ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగంలో సత్తాచాటుతున్నారని అన్నారు. ఇవాళ అంతర్జాతీయంగా ఏ పెద్ద కంపెనీ సీఈవో అయినా.. మనదేశానికి చెందినవారో.. మన భారత సంతతికి చెందినవారే ఉంటున్నారు. ఈ రంగంలో మరింత ముందడుగు వేసేందుకు.. ప్రపంచ స్థాయిలో.. మన యువతను తీర్చదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో ముందుకెళ్లేందుకు.. అవసరమైన రీతిలో యువతకు శిక్షణ, నైపుణ్యత అందించే లక్ష్యంతో.. నీలిట్ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నామన్నారు.

Read also: APPSC Group 1 Main Exam: గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు చేసిన ఏపీ హైకోర్టు!

సికింద్రాబాద్, తిరుపతిల్లో NIELIT సెంటర్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం లభించిన నెల రోజులలోపే ప్రారంభించుకుంటుండటం.. యువత సాధికారత దిశగా మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ఒక నిదర్శనం అన్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ నీలిట్ సంస్థ.. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇతర అనుబంధ కోర్సులలో మెరుగైన శిక్షణను అందిస్తుంది. ఆయా రంగాలలో ఉపాధిని అన్వేషించే విద్యార్థులకు అవసరమైన నైపుణ్య శిక్షణను అందించి ఆయా కంపెనీలకు కావలసిన మానవ వనరులను అందుబాటులో ఉంచటంలో NIELIT కీలకపాత్రను పోషిస్తుందన్నారు. ఐటీ ఎగుమతులలో, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులలో భారత్ ప్రతి సంవత్సరం ఎంతో అభివృద్ధిని సాధిస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం వలన భారత్ ను గమ్యస్థానంగా ఎంపిక చేసుకుని అనేక నూతన కంపెనీలు తమ తమ శాఖలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయన్నారు. కాలానుగుణంగా ఈ కంపెనీలు ప్రథమశ్రేణి నగరాలలోనే కాకుండా ద్వితీయశ్రేణి నగరాలలో కూడా తమ తమ శాఖలను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. అందులో భాగంగా ఆయా ప్రాంతాలలోని కంపెనీలు సంబంధిత రంగాలలో అత్యున్నతస్థాయి నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం ఎంతగానో అన్వేషిస్తున్నాయన్నారు.

Read also: Yarlagadda Venkat Rao: ఏపీలో వచ్చేది టీడీపీ-జనసేన సంకీర్ణ ప్రభుత్వమే: యార్లగడ్డ

రెండు తెలుగు రాష్ట్రాలలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న కంపెనీలకు ఆయా రంగాలలో అవసరమైన అత్యున్నతస్థాయి నైపుణ్య శిక్షణ కలిగిన మానవ వనరులను అందించే కేంద్రాల ఏర్పాటు కూడా ఆవశ్యకమైందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో వందల కొద్దీ నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఉన్నప్పటికీ, ఆయా రంగాలలో అత్యున్నతస్థాయి ప్రమాణాలతో కూడిన నైపుణ్య శిక్షణను అందించే కేంద్రాలు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయన్నారు. అందుకే.. ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధిత రంగాలలో అత్యున్నతస్థాయి శిక్షణ సంస్థల ఏర్పాటుకోసం నేను కేంద్ర మంత్రి అశ్విణి వైష్ణవ్ గారిని కోరడం.. వారు అంగీకరించి.. ఏపీకి, తెలంగాణకు ఒక్కో నీలిట్ సంస్థను కేటాయించడం సంతోషకరం. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. NIELIT కేంద్రం ద్వారా రాబోయే 3 సంవత్సరాల కాలంలో కనీసం 5,000 మందికి శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించడం జరుగుతోందన్నారు.

Read also: AIMIM : బీహార్లో 11లోక్ సభ స్థానాల్లో పోటీచేయనున్న అసదుద్దీన్ ఒవైసీ పార్టీ

తెలుగు రాష్ట్రాలలోని యువతకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు, సంబంధిత రంగాలలో ముందుకు వెళ్లాలని చూస్తున్న నిరుద్యోగులకు ఈ కేంద్రాలు ఒక చక్కటి అవకాశం అన్నారు. ఎంతో అత్యున్నతస్థాయి శిక్షణను అందించే ఈ కేంద్రాలలో శిక్షణను పూర్తి చేసుకున్న వారికి సంబంధిత కంపెనీలలో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. ఆయా రంగాలలో పరిశోధనలకు కూడా ఈ కేంద్రాలు చక్కని వేదికలుగా ఉపయోగపడతాయన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలలో నూతన ఆవిష్కరణలకు, వ్యవస్థాపక స్ఫూర్తిని పెంపొందించడానికి కూడా ఈ కేంద్రాల ద్వారా కృషి చేయడం జరుగుతుందన్నారు. మన తెలుగు రాష్ట్రాల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నామని తెలిపారు.