తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా ఆదివారం నిర్వహించే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి జాతరకు అమ్మవారి దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాల వేడుకలు ఘటోత్సవంతో ప్రారంభమయ్యాయి. నేడు తెల్లవారుజామునుంచే భక్తులు బోనాలు సమర్పించి, ఉదయం 4 గంటలకి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు జరిపించగా.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుటుంబసభ్యులతో కలిసి తొలి బోనం సమర్పించారు. ఉదయం 9 గంటల నుంచి వీఐపీల రాక మొదలవుతుంది. ఇక ఉదయం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకుంటారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదయ్య నగర్ లైబ్రరీ నుంచి 2వేల మంది మహిళలలతో కలిసి బంగారు బోనంతో బయలు అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నసమయంలో అమ్మవారిని దర్శించుకోనున్నారు.
అమ్మవారిని బోనాలతో వచ్చే భక్తులకోసం ప్రత్యేకంగా క్యూలైన్ ఏర్పాటు చేశారు అధికారులు. అయితే ఆ క్యూలైన్‌లో కేవలం మహిళలను మాత్రమే అనుమతిస్తున్నారు. అమ్మవారికి రెండురోజులపాటు జరిగే ఉత్సవాల్లో తొలిరోజు బోనాలు, రెండోరోజు రంగం కార్యక్రమం ఉంటుంది. ఈనేపథ్యంలో.. భక్తులు అమ్మవారికి బోనంతో పాటు సాకను సమర్పిస్తారు. అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను ఇంట్లో తయారు చేసుకొని, ఓ బండిలో పెట్టుకుని ఊరేగిస్తూ వచ్చి, అమ్మవారికి సమర్పించి మిగిలినది మహా ప్రసాదంగా అంతా సేవిస్తారు. వాటినే ఫలహార బండ్లు అంటారు.
కాగా.. బోనాల ఉత్సవంలో మరో ప్రధాన ఆకర్షణ తొట్టెల ఊరేగింపు. రంగురంగుల అట్టలతో తయారు చేసిన తొట్టెలను ఊరేగింపుగా తీసుకొచ్చి భక్తులు అమ్మవారికి మొక్కుతీర్చుకుంటున్నారు. అమ్మవారికి డప్పు చప్పుళ్లకు అనుకూలంగా నృత్యం చేస్తూ పోతురాజులు భక్తులను భక్తి పారవశ్యంతో ముంచెత్తనున్నారు. బోనాల జాతర ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. 3,500 మంది పోలీసులకు విధులు కేటాయించారు. మహిళల కోసం షీటీమ్స్‌ను అందుబాటులో ఉంచారు. సికింద్రాబాద్ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలకు అదనంగా మరో సుమారు 300ల నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్బంగా ఆర్టీసీ 150 ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది.
