భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణతో కలిసి పనిచేయడానికి యూఏఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి హెచ్.ఈ. అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక –2026 సదస్సులో భాగంగా దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో యూఏఈ మంత్రి మంగళవారం భేటీ అయ్యారు. ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందంతో కలిసి రాష్ట్రంలో చేపట్టే భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ముఖ్యంగా భారత్ ఫ్యూచర్ సిటీపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ ను వివరించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు.
భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ అభివృద్ధి అవకాశాలపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇది దేశంలోనే తొలి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకోనుందని తెలిపారు. సుమారు 30 వేల ఎకరాల్లో విస్తరించే ఈ నగరంలో ఏఐ, విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, నివాస, వినోద రంగాలకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్ట్ లో ఇప్పటికే మారుబేని, సెమ్ కార్ప్ వంటి అంతర్జాతీయ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని, ఇటీవలే రిలయన్స్ గ్రూప్ వంతారాతో ఫ్యూచర్ సిటీలో కొత్త జూ ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందం కుదిరిందని సీఎం వెల్లడించారు.
తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటుకు తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ తెలిపారు. ప్రాజెక్ట్ వేగవంతమయ్యేందుకు రెండు ప్రభుత్వాల అధికారులతో సంయుక్త టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. యూఏఈ ఫుడ్ క్లస్టర్‌తో తెలంగాణ కలిసి పనిచేసి గ్రామీణ, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ తరఫున ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
పేదోడి బైక్ Hero Splendor Plus ధర పెంపు.. వేరియంట్ వారీగా కొత్త రేట్లు ఇలా..!
