Site icon NTV Telugu

Tummala Nageswara Rao : రైతులకు గుడ్‌న్యూస్‌.. ఈ నెలాఖరులోగా రైతుబంధు

Tummala Nageshwer Rao

Tummala Nageshwer Rao

నిజామాబాద్ ఆంధ్రానగర్‌లో ఎన్.టి.అర్. విగ్రహాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమ కానుందని ఆయన వెల్లడించారు. రైతాంగ సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆంధ్ర నగర్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు మంత్రి తుమ్మల. నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరని, ఎన్టీఆర్ నేటికీ తరానికి ఆదర్శ ప్రాయుడని ఆయన కొనియాడారు. రైతుల సంక్షేమం కోసం ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చిన మహా నేత ఎన్టీఆర్ అని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. రెండు లక్షల రైతుల రుణమాఫీని దశలవారీగా రైతు ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇదిలా ఉంటే.. మైనింగ్‌‌ మాఫియాను అరికట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం మంత్రి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలంలో జరిగిన అక్రమ గ్రావెల్, బెరైటీస్ తవ్వకాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అక్కడ జరుగుతున్న మైనింగ్ మాఫియాను అరికట్టాలని, ఎవరినీ వదిలి పెట్టొద్దని హెచ్చరించారు. యాసంగి సీజన్‌‌లో యూరియా కొరత లేకుండా చూడాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు.ఇటీవల నిర్మల్ జిల్లాలో యూరియా కొరతకు సంబంధించి మంత్రి వ్యవసాయశాఖ అధికారులను ప్రశ్నించారు. ఇటీవల జరిగిన లారీల సమ్మె కారణంగానే యూరియా రవాణా సమస్య ఎదురై కొరత ఏర్పడిందని, సమ్మె విరమణ తర్వాత సరిపడా నిల్వలు చేర్చామని అధికారులు మంత్రికి వివరించారు. మార్కెట్లలో మిర్చి ధరలు, పంటలకు తెగుళ్ల నియంత్రణ చర్యలపై మంత్రి సమీక్షించారు. పంటల వైవిధ్యంతో రైతుల ఆదాయం పెంచుకోవడంపై అవగాహన కల్పించేందుకు రైతు వేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.

Exit mobile version