ఈమధ్యకాలంలో అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. ఒక్కోసారి బిల్లులు చూసి గుండె గుబిల్లుమంటుంది. తాజాగా తెలంగాణలో వచ్చిన కరెంట్ బిల్లులు షాక్ కొడుతున్నాయి. ఓ సెలూన్ షాప్ కు 19,671 రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. అదే మరో ఇంటికి ఏకంగా 76 లక్షలు బిల్లు వచ్చింది. అమ్మో ఇంత బిల్లా ! అని వినియోగదారులు మైండ్ బ్లాంక్ అయింది. నాయి బ్రాహ్మణులు, రజకులకు ,సెలూన్,లాండ్రీ షాప్ లకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచితంగా వాడుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆయా వర్గాల వారు హర్షం వ్యక్తం చేశారు. అంత వరకు బాగానే ఉంది. ఖమ్మం జిల్లాలో మాత్రం విద్యుత్ అధికారులు బంపర్ ఆఫర్ ఇచ్చారు.
ఖమ్మం జిల్లా మధిరలో ఓ సెలూన్ షాపు ఏకంగా 19,670 /-రూపాయలు కరెంట్ బిల్లు ఇచ్చారు. దీంతో షాప్ నిర్వాహకుడు తాను వంద యూనిట్లు కూడా వాడడంలేదని , ఇంత కరెంట్ బిల్లు రావడం ఏంటని లబోదిబోమంటున్నాడు, అదే వీధిలో నివసిస్తున్న మరో రజకుల ఇంటికి ఏకంగా 76 లక్షల 46వేల 457 రూపాయల బిల్లు ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఇటీవలకాలంలో మీటర్ రీడింగ్ తీసే వాళ్ళు సక్రమంగా తీయడం లేదని అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మీటర్ రీడింగ్ తప్పిదాలు జరిగి అవస్థలు పడుతున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని బాధిత వినియోగదారులు అప్పారావు, నాగేశ్వరరావు కోరుతున్నారు.
