Site icon NTV Telugu

TS Cabinet Meeting: నేడు కేబినెట్‌ భేటీ.. పలు అంశాలపై మంత్రులకు కేసీఆర్ దిశానిర్దేశం

Ts Cabinet Meeting

Ts Cabinet Meeting

TS Cabinet Meeting: ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ప్రగతిభవన్‌లో సమావేశం కానుంది. శాసనసభ సమావేశాలపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ 6 తేదీ నుంచి ఉభయ సభలు సమావేశం కానున్నాయి. ఈసమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహం, సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. ఇక విపక్షాలను ధీటుగా ఎదుర్కొనే విషయమై మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కూడా చర్చించే అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్రానికి నిధులు, విద్యుత్ బకాయిల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో కేబినెట్‌లో ఈ విషయంపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో శాసనసభలోనూ ఇందుకు సంబంధించి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక అన్ని రాష్ట్రాల్లోనూ సీబీఐకి అనుమతి ఉండరాదని ఇటీవల బిహార్ పర్యటన సందర్భంగా సీఎం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయిస్తే అందుకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. 74 ఏళ్లు పూర్తయి 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో వజ్రోత్సవాలను నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది. ఇక జాతీయ రైతు సంఘాల సమావేశ నిర్ణయాలు, తీర్మానాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. వివిధ జిల్లాల్లో ఉన్న పోడు భూముల సమస్య పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వాల్సి ఉన్న తరుణంలో అందుకు సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక రెవెన్యూ శాఖకు సంబంధించి గతంలో చేసిన భూ కేటాయింపులకు ఆమోదంతో పాటు మలక్‌పేటలో సచివాలయ ఉద్యోగుల క్వార్టర్స్ స్థలాన్ని ఐటీ హబ్‌కు కేటాయించే అంశంపై మంత్రివర్గం చర్చించనుంది. ఈనేపథ్యంలో.. నీటి పారుదల ప్రాజెక్టులకు కొన్ని ప్రాజెక్టుల అంచనాలు, సాంకేతిక అంశాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి నియామక మండలి కోసం చట్ట సవరణ బిల్లు కూడా కేబినెట్ ముందుకు రానుంది. తెలంగాణలో దళితబంధు పథకం అమలు పురోగతిపై కూడా కేబినెట్ సమీక్షించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, రాజకీయ పరిస్థితులతో పాటు మునుగోడు ఉపఎన్నిక కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Colombia: పోలీసు వాహనంపై బాంబు దాడి.. 8 మంది అధికారులు మృతి

Exit mobile version