పార్లమెంటరీ సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులను అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ గుజరాత్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా గిర్ జాతీయ వన్యప్రాణుల అభయారణ్యాన్ని టీఆర్ఎస్ ఎంపీలు సంతోష్ కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇతర సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక మల్ధారిస్ అనే గిరిజనులతో స్టాండింగ్ కమిటీ సభ్యులు మమేకం అయ్యారు.
ప్రకృతి నియమాలను గౌరవిస్తే అడవి జంతువులతో కూడా జీవించవచ్చని మల్ధారిస్ గిరిజనుల వద్ద తెలుసుకున్నామని టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సంచార జాతులు, వారి సంస్కృతి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని ఎంతో ఆకట్టుకుందని వివరించారు. సంగీతం విషయంలో భాష తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ మల్ధారీలు జానపద పాటలను తమ భాషలో పాడుతున్నప్పుడు వారి ముఖాల్లో సంతోషం కనిపిస్తోందన్నారు. ఇది కదా రీఫ్రెష్ అంటే అని ఎంపీ సంతోష్‌కుమార్ ట్వీట్ చేశారు.
