Site icon NTV Telugu

Santosh Kumar: ఆసియాలోనే రెండో అతిపెద్ద మర్రిచెట్టు పరిరక్షణకు నడుం బిగించిన టీఆర్ఎస్ ఎంపీ

Santosh Kumar

Santosh Kumar

Santosh Kumar: ఆసియాలోనే రెండో అతిపెద్ద మర్రిచెట్టు తెలంగాణలోనే ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రిలో ఈ వృక్షం నెలకొని ఉంది. 800 ఏళ్ల నాటి ఈ పురాతన వృక్షాన్ని సంరక్షించేందుకు టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ నడుం బిగించారు. ఇప్పటికే ఆయన పర్యావరణ పరిరక్షణకు ఎంతో పాటుపడుతున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో సెలబ్రిటీల చేత మొక్కలు నాటిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఎన్నో లక్షల మొక్కలను నాటారు. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రిలో 800 ఏళ్ల వృక్షం ఎండిపోయే దశకు చేరుకోగా.. దాని సంరక్షణకు తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.2 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పురాతన వృక్షాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైనా ఉందని ఎంపీ సంతోష్ కుమార్ అభిప్రాయపడ్డారు.

అటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి మంత్రి అయ్యాక కూడా పిల్లలమర్రి సంరక్షణకు శ్రీనివాస్‌గౌడ్ కృషి చేస్తుండటం అభినందనీయమని ఎంపీ సంతోష్ కుమార్ ప్రశంసలు కురిపించారు. చారిత్రాత్మక పిల్లలమర్రిని సంరక్షించేందుకు సెలైన్ బాటిళ్లతో ట్రీట్‌మెంట్ చేయడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. పిల్లలమర్రిలోని ప్రతి వేరును కూడా ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ తిరిగి ప్రాణం పోశారని తెలిపారు. ఈ మేరకు పిల్లలమర్రిలోని ప్రతి వేరును పరిశీలించిన ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సెల్ఫీలు, ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం పిల్లలమర్రి పర్యాటకులను ఆకట్టుకునేలా ఉందని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. మంత్రి శ్రీనివాస్‌‌గౌడ్‌తో కలిసి పిల్లలమర్రిని సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

Exit mobile version