బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భారతదేశం, తెలంగాణ అభివృద్ధిపై ఏమాత్రం చర్చించకపోవడం బాధాకరమని టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ సమాజంపై ముప్పేట దాడి చేసేందుకు ఈ సమావేశాల్ని బీజేపీ వాడుకుందని ఆరోపించారు. తెలంగాణ పట్ల ప్రధానికి ఉన్న కక్ష తగ్గి, అభివృద్ధి పథకాలతో పాటు నిధులు ప్రకటిస్తారనుకున్నామని.. కానీ నిరాశే మిగిలిందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే మోదీ పారిపోయారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలిచిందని, తమిళనాడులో జరిగిన రైతు సదస్సులో తెలంగాణ ప్రభుత్వ పథకాలను దేశమంతా అమలు చేయాలని కోరడం శుభసూచకం అన్నారు.
ఇదే సమయంలో బండి సంజయ్‌కి లింగయ్య యాదవ్ ఓ సవాల్ విసిరారు. పెరేడ్ గ్రౌండ్స్ సభ తర్వాత బండి సంజయ్ ఎగిరెగిరి పడుతున్నారని ధ్వజమెత్తిన ఆయన.. సమాచార హక్కు చట్టం కింద తమ ప్రభుత్వంపై సమాచారం కోరడం కాదని, మోదీ ప్రభుత్వంపై సమాచారం కోరాలని సూచించారు. బండి సంజయ్‌కు ఏమాత్రం సిగ్గున్నా.. మోదీపై ఆర్టీఐ (RTI) చట్టం కింద ప్రశ్నలు అడగాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారని మోదీని నిలదీయాలని సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారని.. అయితే అదే పీయూష్ మరుసటి రోజే తెలంగాణకు తన మంత్రిత్వ శాఖ నుంచి అవార్డు ఇవ్వాల్సి లింగయ్య యాదవ్ చెప్పారు.
