NTV Telugu Site icon

ఖమ్మం టీఆర్ఎస్‌లో హీట్‌ పెంచిన ఎమ్మెల్సీ వ్యాఖ్యలు…!

తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.. అధికార పార్టీ అభ్యర్థికి పడాల్సిన ఓట్లు.. ప్రతిపక్ష అభ్యర్థికి పడ్డాయి.. పెద్ద సంఖ్యలో క్రాస్‌ ఓటింగ్‌ జరగడం చర్చగా మారింది. అయితే, ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఇప్పటికే ప్రకటించిన.. టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు… తాజాగా చేసిన కామెంట్లు హీట్‌ పెంచాయి.. ఉమ్మడి ఖమ్మంజిల్లా అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ తుమ్మల అని వ్యాఖ్యానించిన ఆయన.. నా గెలుపు ఉగాది పచ్చడిలా ఉంది. నా గెలుపులో తీపి వేసింది ఎవరో మీకు తెలుసు, చేదు వేసింది ఎవరో మీకు తెలుసు.. అలానే ఇప్పుడు ఏ తప్పు జరిగిందో 2018లో కూడా అదే తప్పు జరిగిందని పేర్కొన్నారు. తుమ్మల మంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల్లో అభివృద్ధి జరిగింది.. కానీ, ఈ రోజు రాజకీయాలు అభివృద్ధికి నోచుకునే వారికన్నా డబ్బుకోసం రాజకీయం చేస్తున్న నేతలే ఉన్నారని కామెంట్ చేశారు.

మన పార్టీలో ఉన్న కొంతమంది వల్లే 2018లో ఎమ్మెల్యే లు ఓడిపోయారంటూ హాట్‌ కామెంట్లు చేసిన తాతా మధు.. తుమ్మల కూడా అలానే ఓడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, తుమ్మల పార్టీలో చేరిన తర్వాతే ఖమ్మంలో టీఆర్ఎస్‌ బలపడిందని స్పష్టం చేసిన ఆయన.. పార్టీలో ఉండి పార్టీకి అన్యాయం చేయొద్దని.. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వారు అసలు పార్టీలో ఎందుకు ఉండాలి అంటూ ప్రశ్నించారు. పార్టీలోకి ఎవరు రమ్మని పిలవలేదన్న ఆయన.. గులాబీ జెండా కింద మనం బతుకుదాం.. నీతి తప్పిన రాజకీయాలు, చిల్లర రాజకీయాలు అసలు వద్దు అంటూ విజ్ఞప్తి చేశారు.. భారీ మెజార్టీ రావాల్సిన పరిస్థితుల్లో ఉన్న ఓట్లుకు తూట్లు పడ్డాయని ఆవేదన వ్యక్తం చేసిన మధు… అలానే ఈ పార్టీలో ఉండి వేరే పార్టీలో రాజకీయాలు చేయొద్దు అని చేతులు ఎత్తి వేడుకున్నారు.. మరోవైపు సీఎం కేసీఆర్ అశ్వారావుపేట నియోజకవర్గన్ని మెచ్చుకున్నారని తెలిపిన ఆయన.. మీకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేను నెరవేరుస్తా.. గత ఎమ్మెల్సీ పనిచేశారా? లేదా? అనేది నాకు అనవసరం, నేను మాత్రం అందరితో కలిసి పనిచేస్తానని ప్రకటించారు.