తెలంగాణలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో శనివారం పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ వచ్చినట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు. ఇటీవల తనను కలసిన వారంతా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ సూచించారు. కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Read Also: ప్రజా సమస్యల కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రత్యేక యాప్
కాగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ ఎంపీలు కే.కేశవరావు, జితేందర్ రెడ్డిలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారు కూడా హోం ఐసోలేషన్‌లో ఉంటూ కోలుకుంటున్నారు. కాగా ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. శనివారం 2,500కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం విస్తృతంగా చర్చలు జరుపుతోంది.
