NTV Telugu Site icon

Patnam Mahender Reddy: నేను సీఐని తిట్టలేదు.. ఇది ఎమ్మెల్యే నిర్వాకమే

Mahender Reddy

Mahender Reddy

తాండూరు సీఐ రాజేందర్‌రెడ్డిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అసభ్యకర పదజాలంతో దూషించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఆడియో అంశంపై ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి స్పందించారు. తాండూరులోని భావిగి భద్రేశ్వర స్వామి జాతర కార్యక్రమంలో తన ముందు రౌడీ షీటర్లు వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందని.. ఈ విషయంలోనే తాను సీఐతో మాట్లాడానని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తెలిపారు. కానీ వైరల్ అవుతున్న ఆడియోలో వాయిస్ తనది కాదన్నారు. తాను సీఐని దూషించలేదని వివరణ ఇచ్చారు.

పోలీసులు అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. అధికారులంతా తాండూరు రావాలని కోరుకుంటారని.. తాను పోలీసులతో మంచిగా వ్యవహరిస్తానని మహేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. నకిలీ ఆడియో వ్యవహారంపై కోర్టునే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ఇవన్నీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేయిస్తున్నారని ఆరోపించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పోలీసులు నోటీసులు ఇస్తే విచారణను ఎదుర్కొంటానని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అన్నారు. కాగా పోలీసులను అసభ్యపదజాలంతో దూషించిన మహేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది.

Show comments