Site icon NTV Telugu

మరో వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి !

మహిళలంతా భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆడుతుండగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి కారు బతుకమ్మల మీదుగా దూసుకెళ్లడం వివాదంగా మారింది. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలకేంద్రంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఆత్మకూరు వచ్చిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో వేణుగోపాలస్వామి దేవాలయం ఎదుట మహిళలు బతుకమ్మలు ఆడుకుంటున్నారు. ఎమ్మెల్యే వస్తున్నారని, రోడ్డుపై నుంచి బతుకమ్మలు తీసివేయాలని మహిళలను ధర్మారెడ్డి అనుచరులు చెప్పారు.

మహిళలు కుదరదనడంతో.. వారిని తోసేసి బతుకమ్మల మీదుగా ఎమ్మెల్యే కారును పోనిచ్చారు. దీంతో మహిళలు అడ్డుకుని ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బతుకమ్మ ఆడుతున్న మహిళలను ఎమ్మెల్యే అగౌరపరిచారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ తప్పుబట్టారు. గతంలో దళితులను అవమానించిన ఎమ్మెల్యే, ఇప్పుడు బతుకమ్మను కారుతో తొక్కించారని ఆయనది కుల అహంకరామంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాత్రం బతుకమ్మ ఆడుతున్న మహిళలను అవమానపరచలేదంటున్నారు. మహిళలను గౌరవించి తాను కారు దిగి నడుచుకుంటూ వెళ్లానని ఆ సమయంలో తాను కోరులో లేనన్నారు. దళితులపై నోరుజారి ఇన్నాళ్లు ఇబ్బందిపడ్డ ధర్మారెడ్డి.. తాజాగా బతుకమ్మను అవమానపరిచి మరో వివాదంలో చిక్కుకున్నారు.

Exit mobile version