NTV Telugu Site icon

యాదాద్రికి 6 కిలోల బంగారం విరాళం ఇవ్వనున్న టీఆర్‌ఎస్‌ నేతలు..

సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన యాదాద్రి ఆలయ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఆలయ నిర్మాణానికి ఇప్పటికే ఎంతో మంది ధన రూపేన, వస్తు రూపేన కానుకలు సమర్పిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా టీఆర్ఎస్‌ నేతలు యాదాద్రి ఆలయానికి విరాళం ప్రకటించారు. టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు కె.నవీన్ కుమార్, శంబీపూర్ రాజు, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, ఎం. హనుమంత రావు, ఎం కృష్ణ రావుతో పాటు కెపి వివేక్ ఆనంద్‌ లు ఒక్కొక్కరు కిలో బంగారాన్ని యాదాద్రి లక్ష్మినరసింహా స్వామి వారి ఆలయ నిర్మాణానికి సమర్పించనున్నట్లు తెలిపారు.

నిన్ననే సీఎం కేసీఆర్‌ యాదాద్రిలో పర్యటించి ఆలయ నిర్మాణాలను పరిశీలించారు. అంతేకాకుండా ఆలయ ప్రారంభోత్సవానికి కూడా ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా యాదాద్రి ఆలయం ప్రత్యేకత సంతరించుకునేలా శిలానైపుణ్యాలతో ఆలయ నిర్మాణం కళ్లు చమక్కుమనేలా తీర్చిదిద్దినట్లు ఇప్పటికే తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో ఆలయాన్ని ప్రారంభించనున్నారు.