NTV Telugu Site icon

Traffic Police Green Channel: 14 కిలోమీటర్లు.. 14 నిమిషాలు

Hydtp

Hydtp

హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు అరుదైన ఘనతను చాటుకున్నారు. గ్రీన్ ఛానెల్ ద్వారా 13.46 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 14 నిముషాల్లో చేరుకుని ఒక ప్రాణాన్ని నిలబెట్టారు. హైదరాబాద్‌లో ప్రయాణం అంటే నరకం. ఎప్పుడు ఎక్కడ ట్రాఫిక్ జాం అవుతుందో తెలీని అయోమయ పరిస్థితి. అయితే, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతూ వుంటారు. గ్రీన్ ఛానెల్ ద్వారా ట్రాఫిక్ ని క్లియర్ చేసి ఎంత దూరమయినా తక్కువ వ్యవధిలో అక్కడికి చేరుస్తుంటారు. ఏవైనా అవయవాలు ఇతర రోగులకు అమర్చాల్చి వచ్చినప్పుడు గ్రీన్ ఛానెల్ ని ఉపయోగించడం ఆనవాయితీ. తాజాగా మలక్ పేట యశోదా ఆస్పత్రి నుంచి జూబ్లి హిల్స్ లోని అపోలో అస్పత్రికి ఓ గుండెని చేర్చడం కోసం ఎంతో శ్రమించారు. ఒకసారి తొలగించిన గుండెను నిముషాల వ్యవధిలోనే అవసరం వున్న వ్యక్తికి అమర్చాలి. అందుకు డాక్టర్లు పడే శ్రమ అంతా ఇంతా కాదు.

మలక్ పేట నుంచి జూబ్లిహిల్స్ చేరుకోవడం సాధారణ సమయాల్లో గంట వరకూ పడుతుంది. అయితే ఒక మానవతా విలువల కోసం, ఒక ప్రాణాన్ని నిలబెట్టేందుకు పోలీసులు ప్రశంసనీయమయిన పాత్రను పోషించారు. 13.46 కిలోమీటర్ల దూరం అంటే.. యశోద మలక్ పేట నుంచి జూబ్లిహిల్స్ అపోలో వరకూ కేవలం 14 నిముషాల వ్యవధిలో హృదయాన్ని చేర్చి ఒక ప్రాణం నిలబెట్టారు. దీనికి సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.

Show comments